హనుమకొండ చౌరస్తా, నవంబర్ 21 : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత నాయకులు, స్వేరోస్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. మొదట అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ మాట్లాడుతూ.. దళిత జాతి బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య 30 ఏండ్లు ప్రజాసేవలో ఉన్నారని, అడిషనల్ డీజీ స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ సామాజికసేవ చేసేందుకు ఉద్యోగాన్ని త్యజించి, అణగారిన వర్గాల విద్య కోసం విశేష కృషి చేసిన నాయకుడిని కించపరిచినట్లు మాట్లాడడం దళిత సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో దళిత లాకప్ డెత్‌లు, దళిత యువకుల హత్యలు, దళిత నాయకులను అవమానించడం, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల ఆకలి కేకలు తప్ప మీరు దళితులకు చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అకడ ఉండడమే కాకుండా, బహిరంగంగా దూమపానం తాగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మీ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిందని క్రిమినల్ కేసులు పెట్టించారని అన్నారు. మా దళిత నాయకులను తూలనాడిన నాయిని రాజేందర్‌రెడ్డిపై పోలీసులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు.
స్వేరో నాయకుడు మంద శ్యామ్ మాట్లాడుతూ.. ఒక పిచ్చి కుకలా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడాడని, బాధ్యతగల ప్రజాప్రతినిధి ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. సోమవారం ఉదయంలోపు నాయిని రాజేందర్‌రెడ్డి దళిత బిడ్డలైన రాజయ్య, ఆర్ఎస్ ప్రవీణ్‌కు క్షమాపణ చెప్పకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో నకలగుట్ట కాళోజీ విగ్రహం నుంచి వెయ్యిడప్పులతో ఇంటి వరకు శవయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. దళిత విద్యార్థి సంఘం నాయకుడు, ఉద్యమకారుడు డాక్టర్ కంజర్ల మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పదవిని త్యాగంచేసిన వ్యక్తి డాక్టర్ రాజయ్య అని అన్నారు. నీచ చరిత్ర కలిగిన నువ్వు స్థాయి మరిచి విమర్శలు చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త.. అని హెచ్చరించారు.
కార్పొరేటర్ ఇమ్మడి లోహిత మాట్లాడుతూ.. నాయిని రాజేందర్‌రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని, దళితుల ఓట్లతో గెలిచి దళితులను తిట్టడాన్ని దళిత సమాజం క్షమించదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగారావు, మాజీ కార్పొరేటర్ మేకల బాబూరావు, నాయకులు తాటికొండ సురేశ్, మారెపల్లి మనోజ్ స్వేరో, చక్రి స్వేరో, పున్నంచందర్, సమ్మయ్య, పండుగ సాగర్, కొడకండ్ల సదాంత్, ప్రభాకర్, జయరాం, హరినాథ్, మహేశ్, ఇమ్మడి రాజు, మంద సృజన్‌కుమార్, మహేందర్, అనిల్, ప్రసాద్, సృజన్, రాజశేఖర్, గణేశ్, చిట్టిబాబు, రమేశ్, రాజేంద్రప్రసాద్, సిద్ధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.