నర్సంపేట/వరంగల్‌చౌరస్తా, సెప్టెంబర్ 14: సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. సీపీఐ ఆధ్వర్యంలో నర్సంపేటలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
విలీన దినోత్సవంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. 17న విమోచన దినోత్సవం పేరిట బీజేపీ తలపెట్టిన కార్యక్రమాలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయన్నారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్‌బండ్‌పై సాయుధ పోరాట యోధుల విగ్రహలు పెడతామని, పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన ప్రభుత్వం హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అనడం సరికాదన్నారు.
కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేశ్, షేక్ బాషమియా, పనాస ప్రసాద్, అక్కపల్లి రమేశ్, కందిక చెన్నకేశవులు, గన్నారపు రమేశ్, గోవర్ధనాచారి, దామెర కృష్ణ, పాలక కవిత, ఇల్లందుల సాంబయ్య, పార్థసారథి, ఐతా యాకూబ్, గడ్డం నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ ఓంకార్ భవన్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు.
అనంతరం ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ చరిత్రలో లిఖించదగ్గ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ, జిల్లా నాయకులు ఐతం నగేశ్, ఎగ్గెని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, నగర నాయకులు గోవర్ధన్, రాజు, నర్సయ్య పాల్గొన్నారు.