సుబేదారి, జనవరి17: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసు క్రీడా పోటీలు హనుమకొండ జేఎన్ఎస్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి మూడు రోజులు 12 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీడా పోటీలతో దేహ దారుఢ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పని ఒత్తిడిని అధిగమించడానికి ఇవి దోహదపడుతాయని సీపీ పేర్కొన్నారు.
ఇందులో ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన 800 పరుగుపందెం, వాలీబాల్ పోటీలను సీపీ ప్రారంభించారు. అదేవిధంగా వాలీబాల్ క్రీడలు సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీలు రవీందర్, రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీ రవి, సురేశ్‌కుమార్, జనగామ ఏఎస్పీ పండరీ చేతన్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.