శాయంపేట, జూన్ 21: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ ఎడ్ల రజిత రెండు రోజుల పాటు టర్కీ దేశంలో పర్యటించారు. అక్కడ ఇంపాక్ట్ ప్యానల్ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ నుంచి హాజరయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ బీసీఐ నియమాలకు అనుగుణంగా పత్తి పండిస్తున్న రైతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్నారు.
శాయంపేట, గీసుకొండ, రేగొండ, పర్వతగిరి మండలాల్లోని 15,653 మంది రైతులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అతి తకువ ధరలో వరంగల్ సూపర్ గోల్డ్, వరంగల్ గోల్డ్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల్లో నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ, పంటలో వివిధ రకాల జీవవైవిధ్యాలను ప్రదర్శిస్తూ, నాణ్యమైన పత్తి దిగుబడులు సాధిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీసీఐ, వివిధ దేశాల వ్యవసాయ ప్రాజెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.