జనగామ, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. అంతర్గత కుమ్ములాటలతో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నది. ‘హత్యా రాజకీయాల’ నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే రక్షణ కావాలంటూ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కడంపై సీనియర్లలో ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా డీసీసీ అధ్యక్షుడు, జనగామ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తనను హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నాడని సొంత పార్టీకి చెందిన మాజీ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచె రాములు వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఇసుక లారీతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రూ.25 లక్షలకు సుపారి గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నాడని అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పించారు. ఈ ఘటన జిల్లా కాంగ్రెస్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. కొమ్మూరి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులైన మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కె ట్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు దూడల సిద్దయ్య, సర్వల నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు గంగరబోయిన మల్లేశం, ముత్యాల చందర్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, జాయ మల్లేశం, గాదెపాక మహేందర్, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, చింతకింది మల్లేశం, పులిగిల్ల శివ తదితర సొంత పార్టీ సీనియర్లు డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ డీసీపీ ఫిర్యాదు చేశా రు. కాంగ్రెస్ పార్టీలో తాను 30 ఏండ్లుగా వివి ధ హోదాల్లో సేవలందించానని, గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని రాములు పేర్కొన్నారు.
కొంతకాలంగా సీనియర్లకు దక్కాల్సిన పదవులను జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి అమ్ముకున్నాడని పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొమ్మూరి తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని, భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అందు లో భాగంగా కొద్దినెలల క్రితం మాజీ మున్సిపల్ చైర్మన్ వై సుధాకర్ కారును పెట్రోల్‌తో దగ్ధం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా తన అనుచరుడైన రావుల శ్రీనివాస్‌రెడ్డిని కొమ్మూరి పిలిపించుకొని రూ. 25 లక్షల సుపారి ఇచ్చి తనను ఇసుక లారీతో ఢీకొట్టించి హతమార్చేందుకు కుట్రపన్నినట్లు తెలిపాడని, ఇదే విషయాన్ని సీనియర్ నాయకుల ముందు శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన వీడియో రికార్డును కంచె రాములు డీసీపీకి అందజేశారు. ప్రశాంతతకు మారుపేరైన జనగామలో ఫ్యాక్షన్ రాజకీయాలతో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్న ప్రతాప్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనతోపాటు సీనియర్ నాయకులకు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో కోరారు.