వరంగల్, జనవరి 3 : రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే గందరగోళంగా మారిం ది. అర్హులైన వారి పేర్లు సర్వే జాబితాలో లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసిన ఫారాలతో బల్దియా చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంలో అప్పుడు అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పు డు అర్హులైన పేదలకు శాపంగా మారా యి.
విద్యార్థులతో ఆదరబాదరాగా ఆన్లైన్ చేయించడంతో అనేక తప్పిదాలు జరిగాయన్న ఆరోపనలు అప్ప ట్లో వెల్లువెత్తాయి. అవే దరఖాస్తుల ప్రకారం సర్వే చేపట్టడంతో చాలా మంది పేర్లు జాబితాలో లేకుండా పోయాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని సర్వే సిబ్బందితో బాధితులు మొరపెట్టుకోగా తామేమీ చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు.
దీంతో బాధితులు కార్పొరేషన్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. అక్కడ బాధితులకు సమాధానం చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు చేసిన తప్పుకు తమకు అన్యాయం జరగడమేంటని బాధితులు నిలదీస్తున్నారు. పేర్లు నమోదు కానివారి కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతున్నారు.