తొర్రూరు, జనవరి 8: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ విప్‌లు, డోర్నకల్, ఆలేరు ఎమ్మెల్యేలు జాటోత్ రామచంద్రూనాయక్, బీర్ల అయిలయ్య, మునుగోడు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మురళీనాయక్, కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని గుర్తూరు గ్రామ శివారులో తమ సొంత వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అనాథాశ్రమానికి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, ఎన్సారై హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దంపతులు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రాజారాంమోహన్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. పనులు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్రెడ్డి అమెరికాలో ఉంటూ తాము సంపాదించిన దాంట్లో నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తూ అనేక ప్రాంతాల్లో భవనాలు కట్టించి ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ పాఠశాలలకు అందించడంతోపాటు పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి అయిన మా అత్త, మామలకు తోడుగా ఉంటానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు భూమి పూజ చేశామన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దంపతులు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏడాదికాలంలో పూర్తి చేసి, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.