రాయపర్తి, జనవరి 7: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇందులో భాగంగా రాయపర్తి జడ్పీహెచ్ఎస్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి నిర్వహణలో ఆంగ్ల ప్రావీణ్యంపై మండలస్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించగా, రాయపర్తి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి జేరిపోతుల దీపిక ప్రథమ స్థానం, కొండూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థి డీ సంజన ద్వితీయ స్థానాల్లో నిలిచారు. స్పెల్ విజార్డ్ పోటీల్లో కే భవ్య, ఎం ఆదిత్య ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రావుల భాస్కర్‌రావు, అమరవాది విజయారాఘవాచార్యులు, మారం రోజారాణి, స్వర్ణలత పాల్గొన్నారు.
విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలి
చెన్నారావుపేట/పర్వతగిరి/సంగెం/నెక్కొండ: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని ఇంగ్లిష్ ఫోరం మండల ఇన్చార్జి మందాడి అనుపమ అన్నారు. చెన్నారావుపేటలోని ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో స్పెషల్ విజార్డ్ పోటీలు నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం కొక్కొండ రజిని ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఇంగ్లిష్‌లో మాట్లాడడం, స్పెల్లింగ్, స్టోరీలను రాయడంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడే విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ ఫోరం బాధ్యులు సంతోష్‌కుమార్, వెంకటరామారావు, సరిత, అమీనా, భిక్షపతి, మంజుల, సీఆర్పీ సంపత్ పాల్గొన్నారు.
పర్వతగిరి ఉన్నత పాఠశాలలో మండలస్థాయి స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించారు. నోడల్ అధికారి లింగారెడ్డి, ఎంఈవో సత్యనారాయణరావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. స్పెల్ విజార్డ్ కార్యక్రమ మండల ఇన్చార్జి ఎల్ వంశీమోహన్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు శాంతికిరణ్, వెంకటేశ్వర్లు, మాధవి, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. కాగా, పర్వతగిరి ఉన్నత పాఠశాలకు చెందిన జీ ఆదర్శ్ స్పెల్ విజార్డ్‌లో ప్రథమ స్థానం, మోడల్ స్కూల్‌కు చెందిన పార్వతి, జే ధర్మతేజసాయి ద్వితీయ స్థానం పొందారు. మోడల్ స్కూల్ విద్యార్థి నేహ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో ప్రథమం, బీ శ్రుతి ద్వితీయ స్థానం పొందినట్లు చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
సంగెం మండలం మొండ్రాయి జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం కే విజయ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇంగ్లిష్‌పై ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈ తరహా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్పెల్ విజార్డ్ పోటీల్లో టీ రష్మిత ప్రథమ స్థానం, తాటికొండ వైష్ణవి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే, స్టోరీ టెల్లింగ్ పోటీల్లో బీ కమల, జీ నయనశ్రీ ప్రథమస్థానం, కే జ్యోతి ద్వితీయ స్థానం సాధించి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో నిర్వాహకుడు పూల శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు ఎస్ సత్యం, సుస్మిత, ఎన్ మానస, ఎం వెంకటేశ్ పాల్గొన్నారు.
నెక్కొండ హైస్కూల్లో మండలస్థాయి ఆంగ్ల భాష స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజత్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యార్థులకు అంగ్ల భాషపై పరిజ్ఞానం అత్యంత అవసరం అన్నారు. స్పెల్ విజార్డ్ విభాగంలో మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆర్ పూజిత ప్రథమం, బీ ఆశ్రిత ద్వితీయ బహుమతి పొందారు. స్టోరీ టెల్లింగ్ విభాగంలో నెక్కొండ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న భట్టు నిఖిల్‌వర్మ ప్రథమ, మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం మోహిని ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీ లక్ష్మణ్, ఉపాధ్యాయులు మీర్ ఇక్బాల్‌ఖాన్, బండారి రమేశ్, ముడుసు నర్సయ్య, బీ వినయ్‌కుమార్, బీ ఉప్పలయ్య హాజరయ్యారు.