వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్19: ఎంజీఎం దవాఖాన ఆవరణలోని షాపులకు అద్దె చెల్లించక, నిబంధనలు పాటించక కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంజీఎం దవాఖానను సందర్శించిన సంద ర్భంలో అద్దె గదుల విషయంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ సత్యశారద వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిల్, మట్టెవాడ పోలీస్ అధికారి, మున్సిపల్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గురువారం కమిటీ తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డా యి.
ముఖ్యంగా అమృత్ ఫార్మసీ పేరుతో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపులో 2020 సంవత్సరం వరకు మాత్రమే మందులకు అనుమతులు న్నాయని, నాలుగేళ్లుగా అనుమతులు లేకుండానే కొనసాగిస్తున్నారని తేలింది. 2023లో ఎంజీఎం సూపరింటెండెంట్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఖాళీ చేయకుండా అమ్మకాలు జరుపుతున్నారని, మరో వ్యక్తి పాల అమ్మకాల కోసం అనుమతులు తీసుకొని, కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు, టెలిఫోన్ బూత్ పేరుతో అనుమతులు తీసుకొని హోటల్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 13 షాపుల నిర్వహణలో పూర్తిగా నిబంధనల అతిక్రమణ జరిగిందని, అందుకు సంబంధించిన నివేదికను షాపుల వారీగా నివేదికను తయారు చేసి కలెక్టర్‌కి అందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు.