సంగెం/గీసుగొండ, నవంబర్ 28: సంగెం మండలంలోని పల్లార్గూడ ప్రాథమికోన్నత పాఠశాలతోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేసేందుకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో కాసర్ల రవీందర్, కార్యదర్శి పాల్గొన్నారు. రెండో విడతలో గీసుగొండ మండలంలోని 21 గ్రామాలకు జరిగే పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, కోనాయిమాకులు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్స్డెస్క్తోపాటు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణవేణి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు-2025 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్‌గౌడ్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు.
వర్ధన్నపేట/రాయపర్తి/పర్వతగిరి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. గ్రామాల వారీగా నాయకులు ప్రత్యేక సర్వేలు, సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మండల పరిధిలోని 18 గ్రామాలకు సంబంధించి 7 క్లస్టర్లను ఎంపిక చేశారు. దీంతో క్లసర్ల వారీగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండో రోజు 18 గ్రామ పంచాయతీలో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు 22 మంది సర్పంచ్ స్థానాలు, 42 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. అలాగే, రాయపర్తి మండలంలో 40 సర్పంచ్, 342 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 39 మంది సర్పంచ్, 58 మంది వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేసినట్లు రాయపర్తి ఎంపీడీవో కిషన్‌నాయక్ తెలిపారు. పర్వతగిరి మండలంలో 42 సర్పంచ్, 65 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు.
సంగెం: మండల పరిషత్ కార్యాలయానికి ఎన్నికల సామగ్రి శుక్రవారం చేరింది. డిసెంబర్ 14న మండలంలో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం కావాల్సిన సామగ్రి కార్యాలయానికి చేరింది. ఈ నెల 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.