వరంగల్ చౌరస్తా, జూలై 9 : వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధవారం నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె కాన్ఫరెన్స్ హాల్లో ఆర్అండ్బీ, వైద్య, ఆరోగ్య శాఖ, టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్, అనస్థీషియా, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర క్లినికల్ విభాగాల ఏర్పాటుకు అసవరమైన మౌలిక వసతుల అంశాలపై వైద్యాధికారులతో సమీక్షించారు. క్లినికల్ విభాగాల కేటాయింపు కోసం కావాల్సిన అంశాలను తెలియజేస్తూ సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎంజీఎం హాస్పిటల్లో వినియోగిస్తున్న యంత్ర పరికరాల తరలింపు సహా అవసరమైన కొత్త పరికరాల వివరాలను అందజేయాలని, నివేదిక ఆధారంగా సంబంధిత శాఖ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నదని తెలిపారు. ఏ అంతస్తులో ఏ విభాగం ఉండాలి? కావాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భవన నమూనాను పరిశీలించి, నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమావేశంలో ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్‌కుమార్, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతినిధి శరవన్, ఆర్అండ్బీ అధికారి రాజేందర్, టీజీ ఎంఎస్ఐడీసీ డివిజన్ ఇంజినీరింగ్ అధికారి, ఆర్ఎంవోలు, పలువురు విభాగాధిపతులు పాల్గొన్నారు.