భూపాలపల్లి టౌన్, మే 5: ప్రభుత్వ సంక్షే మ ఫలాలు అర్హులందరికీ అందాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని ప్రగతి భవన్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలు, సాధనలు, ప్రభుత్వ వివిధ శాఖల సబ్సిడీ రుణాల అందజేతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లకు సబ్సిడీ విడుదల చేసిన వాటిని బ్యాంకర్లు లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయాలన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 వరకు రూ.874.54 కోట్ల పంట రుణాలు లక్ష్యం కా గా, రూ. 637.37 కోట్ల రుణాలు రైతులకు మంజూరు చేసినట్లు చెప్పారు.
వ్యవసాయ టర్మ్ రుణాలు రూ. 383.18 కోట్ల లక్ష్యం కా గా, రూ.40.46 కోట్లు అందజేశామన్నారు. ఎంఎస్ఎంఈ కింద రూ.116.99 కోట్ల లక్ష్యానికి రూ.5.83 కోట్ల రుణం అందజేసినట్లు చె ప్పారు. గృహ రుణాల కింద రూ.33.98 కోట్ల లక్షానికి రూ. 15.47 కోట్లు మంజూరు చేశామని, ప్రాధాన్యతా రంగాలకు రూ.1,555. 50 కోట్ల లక్ష్యానికి రూ.772.6 కోట్లు సాధించినట్లు చెప్పారు. దళితబంధు పథకంలో భాగం గా 60 నుంచి 70 రవాణా యూనిట్లు వారంలోగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కో రారు. మిగతా రవాణేతర యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ప్రాధాన్యత రంగాలకు రూ.1,723. 82 కోట్లు, అప్రాధాన్యతా రంగాలకు రూ.213. 52 కోట్లు, మొత్తం రూ.1,937.34 కోట్ల లక్ష్యంతో 2022-23 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,551. 2 కోట్లు లక్ష్యంగా పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎస్బీఐ ఏజీఎం ఎండీ అలీమొద్దీన్, ఏపీజీవీబీ ఆర్ఎం శ్రీధర్‌రెడ్డి, టీజీబీ అసుర్ చంద్రశేఖర్, ఆర్బీఐ ఎల్డీవో సాయి చరణ్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ నాను నాయక్, డీఆర్డీవో పురుషోత్తం, ఇండస్ట్రీస్ జీఎం శ్రీనివాస్, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ పాల్గొన్నారు.