మహబూబాబాద్ రూరల్, మే 14 : నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి గాలికి వదిలేసిందని ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్లీ అవే హామీలు ప్రకటించడంతో జనం ఆ పార్టీని నమ్మలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది రోజుల్లోనే అన్నివర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారని, ప్రజల్లో వచ్చిన చైతన్యంతోనే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలలుగా పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విరామం లేకుండా గ్రామాల్లో ప్రచారం చేశారని, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే లబ్ధి పొందారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తండాలు, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను ఆగం చేస్తున్నారని, సాగునీరు అందక సగం పంటలు ఎండిపోయాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, గద్దె రవి, చిట్యాల జనార్దన్, రవికుమార్, మంగళంపల్లి కన్న, ఆవుల వెంకన్న పాల్గొన్నారు.