‘అమరుల ఆశయాలకు తగినట్లు సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నడు. వ్యవసాయాన్ని మంచిగ చేసిండు. పిల్లలకు నౌఖర్లిస్తాండు.. ఊర్లను బాగు చేసిండు. మావోడు బతికుంటె ఎంత సంబురపడునో.. మా కొడుకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండు. ముఖ్యమంత్రి కేసీఆరే మా కుటుంబానికి పెద్ద దిక్కయిండు. రూ.10 లక్షల సాయంజేసి ఆదుకున్నడు. మా చిన్నకొడుక్కు కొలువిచ్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటం’ అంటున్నరు అమరుడు భోజ్యానాయక్ తల్లిదండ్రులు..
– రఘునాథపల్లి జూన్ 27
రఘునాథపల్లి జూన్ 27 : ‘పెద్దకొడుకని ముద్దుగా పెంచినం.. తెలంగాణ ఉద్యమంల యేడ మీటింగ్ అయితే ఆడికి పోయేటోడు. తెలంగాణ కోసమే బలిదానం చేసుకుంటున్న అని హనుమకొండల నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నడు. కొడుకు కాలంజేసి పుట్టెడు దుఖఃంలో ఉన్న మమ్ములను కేసీఆర్ సారు దేవునిలెక్క ఆదుకున్నడు. రూ.10 లక్షల ఆర్థిక సాయం జేసిండు. మా చిన్న కొడుకు సాజ్కు నౌకరీ ఇచ్చిండు. ఇప్పుడు తెలంగాణ అన్నితీర్ల మంచిగైంది. నా కొడుకు యాడున్నడో. బతికుంటే సంబురపడేటోడు’ అని భోజ్యానాయక్ తల్లిదండ్రులు నామా-మక్తి భావోద్వేగంతో చెప్పారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి పంచాయతీ పరిధిలోని వీరారెడ్డి తండాకు చెందిన లునావత్ నామా-మక్తి దంపతుల పెద్ద కొడుకు భోజ్యానాయక్ డిగ్రీ పూర్తి చేశాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతడు, తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని 2012, మార్చి 24న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భోజ్యానాయక్ కుటుంబానికి అండగా నిలిచింది. రూ.10లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు అతడి సోదరుడు సాజ్నాయక్ కు వీఆర్వోగా ఉద్యోగం కల్పించింది.
ఈ సందర్భంగా అతడి తల్లిదండ్రులు మాట్లాడు తూ ‘మాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు బిడ్డ లు. పెద్ద కొడుకు కనబడకుంటపోయిండు.. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతాంది. ఎంత పనిచేస్తివి బిడ్డా అని గుండెలు బాదుకున్నం. ఎన్నో రోజులకు గానీ మాములు మనుషులం కాలేదు. మావోని బలిదానాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మాకు అండగ నిలిచింది. సీఎం కేసీఆర్ మీ కుటుంబానికి మేమున్నమని భరోసా ఇచ్చిండు. ఆర్థిక సాయం అందించిండు. ఇంటర్ వరకు చదివిన చిన్నోడికి వీఆర్వో నౌఖరి ఇచ్చిండు. కేసీఆర్ సారే మాకు పెద్దకొడుకు లెక్క భావిస్తున్నం. సీఎం కేసీఆర్ పాలనల తెలంగాణ ఎంతో అభివృద్ధి అయింది. కరంటు కష్టాలు పోయినయ్. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నరు. తాగునీటికి ఢోకా లేకుండ చేసిండ్రు. పిల్లలకు సర్కారు కొలువు వస్తున్నయ్. ఎన్నో మంచి పనులు జరుగుతున్నయ్.. ఇప్పుడు మావోడు బతికుంటె ఎంతో సంబురపడేటోడు’ అని గుర్తుచేసుకున్నారు.
ఉద్యోగంలో అన్నయ్యను చూస్తున్నా..
మా అన్నయ్య భోజ్యానాయక్ తెలంగాణ కోసం అమరుడైన తర్వాత మా కుటుంబ పరిస్థితి అధ్వానంగా మారింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పినట్లుగానే సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబట్టుకున్నరు. నాకు దేవరుప్పుల మండలంలో వీఆర్వోగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం తొర్రూరు డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. ఉద్యోగంలో అన్నను చూసుకుంటూ అమ్మ-నాన్నను కంటికి రెప్పలా చూసుకుంటున్నా. అమరుల ఆత్మకు శాంతి చేకూరేలా వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలువడం సంతోషంగా ఉంది.
– లూనావత్ సాజ్నాయక్, అమరుడు భోజ్యానాయక్ తమ్ముడు