వరంగల్, ఏప్రిల్ 11 : సమాజంలోని రుగ్మతలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమసమాజ కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహా త్మ జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మంగళవారం జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా ములుగు రోడ్డు జంక్షన్‌లోని ఫూలే విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పూల మాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అనంతరం సునీ ల్ గార్డెన్లో జరిగిన ఫూలే జయంతి సభ లో చీఫ్‌విప్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరా వు ఫూలే ఎంతో కృషి చేశారన్నారు. ఫూలే కలలను సాకారం చేసే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. రూ.కోటితో నియోజవర్గంలో ఫూలే నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ విప్ ప్రకటించారు.
ఇప్పటికే న్యూ శాయంపేట వద్ద స్థలాన్ని ఎంపిక చేశామని చెప్పారు. దీంతోపాటు 24 కులాలకు ప్రత్యేకంగా రూ.24లక్షల చొప్పున కేటాయించి కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే అశయాల సాదన కోసం కృషి చేయాలన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు, దురాచారాలను అంతమొందించేందుకు జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు. కాగా, పూలే జయంతి వేడుకలలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి రాంరెడ్డి, కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, సోదా కిరణ్, బీఆర్ఎస్ నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, దేవరకొండ సురేందర్, కంజర్ల మనోజ్‌కుమార్, మాలకుమ్మరి పరశురాములు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, తిరునహరి శేషు, నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్లో..
నయీంనగర్ : బీసీలు ఏకం కావాలని చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. బీసీ ఎడ్యుకేషనలిస్ట్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. బీసీల కోసం ఫూలే భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. కుడా చైర్మన్ సుందర్రాజ్, వన్నాల శ్రీరాములు, రాజేశ్‌కుమార్, రామ్మూర్తి, చక్రపాణి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.