మహబూబాబాద్, డిసెంబరు 12 (నమస్తే తెలంగాణ) : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) విశేషంగా కృషి చేస్తున్నది. మాస్క్‌లు, యూనిఫాంలు, జూట్ బాగ్యుల తయారీతో ప్రోత్సహిస్తున్నది. ఈ మేరకు ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నది.
జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు 2019 నవంబర్‌లో హైదరాబాద్ నుంచి అంబిక అనే శిక్షకురాలు కేసముద్రం వచ్చారు. ఆమె వద్ద మండల కేంద్రంలోని ‘సాధికారత మండల సమాఖ్య’కు చెందిన 30 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. అనంతరం సభ్యులు అప్పటి కలెక్టర్ గౌతమ్‌ను సంప్రదించి మాస్క్‌లు కుట్టే చిన్నపాటి ఆర్డర్‌ను పొందారు. మొదటి, రెండో విడత లాక్డౌన్ కలిపి మొత్తం లక్ష వరకు మాస్కులు కుట్టి అందించారు. ఒక్క మాస్క్‌కు రూ.4 చొప్పున అధికారులు చెల్లించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పని అప్పగించారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో సెర్ప్ అధికారులు కొత్త నినాదంతో ముందుకొచ్చారు. ‘ప్లాస్టిక్ నిషేధిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో జ్యూట్ బ్యాగులకు మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు సమాఖ్య సభ్యులు ‘సెర్ప్, సాధికారత మండల సమాఖ్య కేసముద్రం’ పేరుతో నమూనా సంచులను మూడు రూపొందించి ప్రాజెక్టు మేనేజర్ నళినికి చూపించారు. వాటిని ఆమె అప్పటి కలెక్టర్‌కు చూపడంతో వాటిని మెచ్చిన ఆయన, ప్రతి మండల సమాఖ్యకు మూడు సంచుల చొప్పున కుట్టి అందించాలని ఆదేశించారు. మండల సమాఖ్యలతో పాటు ప్రతి గ్రామ సమాఖ్యలకు సైతం సంచులను అందించారు. మండల, గ్రామ సమాఖ్యల మహిళలు ఈ సంచులను ఉపయోగిస్తుండడంతో ప్రచారం బాగా జరిగింది. దీంతో వివిధ శుభకార్యాల కోసం పలువురు ప్రత్యేకంగా ఈ సంచులను ఆర్డర్ ఇచ్చి కుట్టిస్తున్నారు.
మొబైల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్, లంచ్‌బాక్స్ బ్యాగులు, కూరగాయల కోసం, స్టూడెంట్స్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్ బ్యాగులు, క్లాత్ బ్యాగ్‌లు, ఇలా అన్ని రకాల బ్యాగ్‌లను కుట్టి విక్రయిస్తున్నారు. సైజులు బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. రూ.60 నుంచి రూ.300 వరకు ఒక బ్యాగ్ ధర ఉంటున్నది. కూరగాయల కోసం వినియోగించే సంచులను రూ.25నుంచి రూ.30 చొప్పున అమ్ముతున్నారు.
గతంలో నేను కుట్టు మిషన్ నడుపుతూ మా కుటుంబానికి చేదోడుగా ఉండేది. 2019లో సెర్ప్ ఆధ్వర్యంలో 30మంది సభ్యులకు సంచుల తయారీపై శిక్షణ ఇప్పించారు. ‘ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే పేరుతో జూట్ బ్యాగులు కుట్టి ఉపాధి పొందుతున్నాం. రోజుకు రూ.500 చొప్పున గిట్టుబాటవుతోంది. నాతో పాటు సరిత, రేష్మా, ప్రమీల భాగస్వాములుగా ఉన్నరు. వచ్చిన ఆదాయాన్ని నలుగురం సమానంగా పంచుకుంటున్నం. ఆర్డర్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అప్పటి అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తన పెళ్లి కోసం 150 సంచులను ప్రత్యేకంగా కుట్టించుకున్నరు. సామాన్య ప్రజలు మొదలు ఉన్నత స్థాయి అధికారుల దాకా వీటిని చూసి అభినందిస్తున్నరు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్డర్లను ఏపీఎమ్ రాజీర్, డీపీఎం నళిని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య మాకే ఇస్తున్నరు. ఈ సంచులు కావాలనుకునేవారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(విలేజ్) ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మా షాపులో సంప్రదించాలి.