‘భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటి రోజు..’ చందమామ అందిన రోజు.. బృందావని నవ్విన రోజు..’ అంటూ ప్రతి భారతీయుడు పాడుకుంటున్నాడు.. అల్లంతదూరాన ఉన్న నెలరేడు చెంతకు చేరాడన్న పరవశంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. కోట్లాది కన్నుల ఉత్కంఠకు తెరదించుతూ ‘చంద్రయాన్-3’ విజయవంతం కావడం ప్రతి ఒక్కరిలో సంబురాన్ని నింపింది. బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కాగానే చిన్నా పెద్దా విజయసంకేతాలతో కేరింతలు కొడుతూ పండుగ చేసుకున్నారు. ఈ అత్యద్భుత సందర్భాన్ని టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షించారు. జాబిల్లిపై చంద్రయాన్ అడుగుపెట్టగానే వీధిల్లోకి వచ్చి మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కృషిని వేనోళ్లా కొనియాడారు. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)పై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అభినందనల వర్షం కురిపించారు.
రీజనల్ సైన్స్ సెంటర్లో..
హనుమకొండ, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (టీఎస్సీఓఎస్టీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండ హంటర్‌రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో బుధవారం చంద్రయాన్-3ని విద్యార్థులు, సందర్శకులు వీక్షించారు. చంద్రయాన్-3లో చంద్రుడిపై ఉపగ్రహం లాండింగ్ దృష్యాన్ని చూసేందుకు సైన్స్‌సెంటర్ గేటు వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలను సైన్స్ సెంటర్ రిసోర్స్ పర్సన్స్ నివృత్తి చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఏర్పాట్లను డాక్టర్ రాకేశ్, నితీశ్‌రెడ్డి, కీర్తి వివేక్, అభినవ్, అనిల్, నటేషన్, సైన్స్ సెంటర్ ఉద్యోగులు వీ వెంకటేశ్వర్రావు, అశోక్‌కుమార్, రాజయ్య, దీపిక, సబిత, నాగమణి పర్యవేక్షించారు. కాగా, పాఠశాల విద్యార్థులకు బయోలాజికల్ సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసినట్లు సైన్స్ సెంటర్ ప్రొజెక్టర్ కో ఆర్డినేటర్ ఈ. రాకేశ్ తెలిపారు. బుధవారం ఈ వ్యాన్‌ను రీజినల్ సైన్స్ సెంటర్‌కు తీసుకురాగా విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు.
ఎల్బీ కళాశాలలో..
హనుమకొండ చౌరస్తా : స్థానిక లాల్ బహదూర్ కళాశాలలో భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు చంద్రయాన్-3 లైవ్‌లో చూపించారు. భారత శాస్త్రవేత్తల ఘనకీర్తిని విద్యార్థులకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు. భౌతికశాస్త్ర విభాగం అధిపతి సీహెచ్ రవీందర్, కే సుధాకర్, వీ మధుకర్‌రావు, వైస్ ప్రిన్సిపాల్‌కు రాజేందర్‌రెడ్డి, ప్రశాంతి, కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, సతీశ్, నగేశ్, విజయ్, అధ్యాపకులు, విద్యార్థులు ఫిజిక్స్ విభాగం ఏర్పాటు చేసిన ల్యాబరేటరీలో ఈ చంద్రయాన్-3 వీక్షించారు.
నిట్‌లో..
హనుమకొండ చౌరస్తా: వరంగల్ నిట్ విద్యార్థులు చంద్రుడిపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే ఘట్టాన్ని వీక్షించారు. నిట్ ఆడిటోరియంలో చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయగా ప్రొఫెసర్లు, విద్యార్థులు, వీక్షించారు. ల్యాండింగ్ అవుతున్న క్రమంలో విద్యార్థులు వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. విజయవంతంగా చందమామపై ల్యాండ్ అయిన తర్వాత విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
కేజీబీవీల్లో..
భీమదేవరపల్లి/ధర్మసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో చంద్రయాన్-3 విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠగా టీవీ ముందు కూర్చున్న విద్యార్థులు చంద్రయాన్-3 విజయవంతం కావడంతో జై భారత్.. జయహో భారత్ అంటూ చేశారు. పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. ధర్మసాగర్ కేజీబీవీలో విద్యార్థులు చంద్రయాన్-3 తిలకించారు. చంద్రుడిపై దిగిన విక్రమ్ రోవర్ ల్యాండ్ కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్టీ సుమలత విద్యార్థులకు తెలియజేశారు.
అవధుల్లేని ఆనందం కలిగించింది
హనుమకొండ: మన దేశానికి చందమామ అందిన రోజును తీసుకొచ్చి ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించిందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. చంద్రుడిపై దేశం విక్రమ్ ల్యాండర్ దింపి నవశకానికి నాంది పలికిందన్నారు. చంద్రయాన్-3 సక్సెస్‌పై భారతీయులుగా గర్వించాలని, నాకు అవధులు లేని అనందం కలిగించిందన్నారు.
ఇస్రో శాస్ర్తావేత్తల కృషి అభినందనీయం
కాజీపేట: చంద్రయాన్-3ని సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. చంద్రయాన్-3 సక్సెస్‌తో కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు చైర్మన్ కోండ్ర నర్సింగరావు, కో కన్వీనర్లు పాక వేదప్రకాశ్, అనుమాల శ్రీనివాస్, సంతోశ్‌కుమార్, మాధవరావు, మహేశ్, రమేశ్, సాయి రాజ్, వెంకట్‌రెడ్డి, రవి, ఎస్కే జానీ పాల్గొన్నారు.