ఎన్నికల ప్రచారంలో ముందువరుసలో ఉన్న బీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ గెలిపిస్తే చేయబోయే పనులను ‘మ్యానిఫెస్టో’ ద్వారా వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నది. ఇలా పల్లె, పట్నం అంతటా కలియదిరుగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సబ్బండ వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఇంటింటికీ వెళ్లి తమను ఆదరించి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, పుల్లూరు రామయ్యపల్లి వార్డుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్లీ గెలిపిస్తే భూపాలపల్లి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయించి సమగ్ర అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన టీబీజీకేఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గండ్రను మరోమారు గెలిపించుకుంటామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆదివారం నెల్లికుదురు మండలం వావిలాల నుంచి తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని వావిలాల, రాజ్యతండా, బోటిమీదితండా, నర్సింహులగూడెం, కాస్యతండా, హేమ్లతండాల్లో కలియదిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్లు, పూలతో ప్రజలు సాదరంగా స్వాగతించారు.
స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రోడ్‌షో ద్వారా ప్రచారం చేశారు. మీరు ఇచ్చిన అవకాశంతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దళితబంధు, గృహలక్ష్మి ఇల్లు, బీసీ, మైనార్టీ బంధును అర్హులకు అందిస్తానని, నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
నగరంలోని 50, 51, 59వ డివిజన్లలో వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. అలాగే బాపూజీనగర్‌లోని అల్ఫా ఓమెగా చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొని క్రైస్తవులందరూ ఆదరించాలని ఓట్లు అభ్యర్థించారు.
మంగపేట మండలం కమలాపురంలో వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావుతో కలిసి ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి పాల్గొన్నారు. బీఆర్ఎస్ది పేదల మేలు కోరే మ్యానిఫెస్టో అని, బృహత్తర పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు.
బచ్చన్నపేట మండలంలోని రామచంద్రాపూర్, కొన్నె, దబ్బగుంటపల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయని.. తనను ఆశీర్వదించి గెలిపిస్తే జనగామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానంటూ ఓట్లు అభ్యర్థించారు. రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని పల్లాను గెలిపించాలని కోరారు.
నర్సంపేట పట్టణంలోని సర్వాపురం, భాంజీపేటలో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలన్నారు.