వరంగల్, మార్చి20: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గురువారం కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రూ. 1071.48 కోట్ల బడ్జెట్ అంచనాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ ఏకుల కొర్నేలుకు సంతాప తీర్మానంతో పాటు బడ్జెట్‌పై చర్చ గంటలోనే ముగిసింది. అకౌంట్ అధికారి సరిత సభలో బడ్జెట్ అంచనాలు వెల్లడించగా సభ్యులు ఆమోదం తెలిపారు.
గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 421.36 కోట్ల అంచనాలు పెరిగాయి. రూ.337.38 కోట్లు బల్ది యా సొంత ఆదాయంగా, వివిధ గ్రాంట్ల రూపేణా 728.10 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రూ. 6కోట్లు డిపాజిట్లు, అడ్వాన్స్‌లు కలుపుకొని రూ.1071.48 కోట్లుగా బడ్జెట్ అంచ నా వేశారు. సొంత ఆదాయంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా రూ.33.74 కోట్లు కేటాయించారు.
దీనితో పాటు 42 వీలీన గ్రామాల అభివృద్ధికి రూ. 24.77 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 627.82 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 55.28 కోట్ల నిధులు గ్రాంట్ల రూపేణా వస్తాయని అంచనా వేశారు. అలాగే సొంత అదాయంలో పన్నుల రూపే ణా రూ. 100.50 కోట్లు, స్టాంప్ డ్యూటీ ఫీజులు రూ. 40 కోట్లు, మున్సిపల్ ఆస్తుల కిరాయిలు రూ. 9.27 కోట్లు, భవన నిర్మాణ అనుమతులు రూ. 136.05 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు రూ. 21.76 కోట్లు, నల్లా పన్నులు రూ. 29.82 కోట్లు వస్తాయని చూపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లలో 15వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణ ప్రగతి ద్వారా రూ. 75లక్షలు, ప్లాన్ గ్రాంట్‌లో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, మైనార్టీ సబ్‌ప్లాన్, స్వచ్ఛభారత్ మిషన్, సీఎంఏ పథకాల ద్వారా రూ. 143 కోట్లు, నియోజవర్గ అభివృద్ధి, స్పెషల్ డెవలప్మెంట్, ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 510.10 కోట్లు వస్తాయని బడ్జెట్లో చూపారు. సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.