సుబేదారి, ఫిబ్రవరి 21 : వరంగల్ నగరంలో రక్తపుటేరులు పారుతున్నాయి. హత్యలు, హత్యా ప్రయత్నాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రోజురోజుకూ దారుణ ఘటనలు వణికిస్తున్నాయి. దుండగులు పగబట్టి సాటి మనుషులను నడి రోడ్డుపైనే నరికి చంపుతున్నారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశానికి లోనై కొందరు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీలతో మరికొందరు ప్రత్యర్థులపై దాడికి తెగబడుతున్న ఘటనలు ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ప్రధానంగా వరంగల్ నగరంలో చోటుచేసుకుంటున్నాయి. అయితే వీటిని నియంత్రించాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే దుండగులు రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలల క్రితం నగరంలో ఒకే రోజు మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధి రంగంపేటలో కారులో వృద్ధుడి దారుణ హత్య, కాజీపేట పోలీసు స్టేషన్ పరిధి బాపూజీ నగర్లో వృద్ధుడిపై ఓయువకుడు కత్తితో దాడిచేసిన ఘటనలు కలకలం రేపాయి. గతనెల 22న పట్టపగలు సుబేదారి పోలీసు స్టేషన్ పరిధి అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ మరో ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిని మరిచిపోకముందే గురువారం రాత్రి నగరంలోని భట్టుపల్లి ప్రధాన రోడ్డుపై కారులో వస్తున్న వైద్యుడు సుమంత్రెడ్డిని ఇనుప రాడ్లతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉంది.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు వారి ఏరియాలో ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అలర్ట్ అవుతున్నారే తప్ప ముందస్తుగా నేరం జరగకుండా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. పాత నేరస్తులపై నిఘా పెట్టడం, భూ తగాదాలు, కుటుంబ గొడవలు, ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యర్థులతో ముప్పుందని తెలిసినప్పటికీ వారిని గట్టిగా హెచ్చరించకపోవడంతో హత్యలు, దాడులకు దారి తీస్తున్నట్లు జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జనవరి 1నుంచి డిసెంబర్ 31 వరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 40 హత్యలు జరగగా, వీటిలో 20కి పైగా నగరంలోనే చోటుచేసుకున్నాయి. 107 హత్యా యత్నాలు జరగగా, గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చితే ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే హత్యలు, హత్యాయత్నాలు రెట్టింపయ్యాయి.