హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 4 : అక్రమ అరెస్టులు కడియం పతనానికి నాంది అని, నీతిమాలిన పనులు చేసిన నీ ఉప ఎన్నిక కోసం ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వేలేరు మండలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడియం శ్రీహరి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి పల్లా ప్రకటన విడుదల చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సోడషపల్లి గ్రామస్తులను కడియం అక్రమంగా అరెస్టు చేయించారని అన్నారు.
నీ అధికార మదం ఎప్పటికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఏ పదవులు లేకుండా ఉన్న నిన్ను గులాబీ జెండా అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిందని గుర్తు చేశారు. చివరికి నీ బిడ్డకు కూడా టికెట్ తీసుకుని ఊసరవెల్లి సిగ్గుపడేలా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేలా వ్యవహరించావని ఎద్దేవా చేశారు. నువ్వు స్టేషన్ఘన్పూర్కు పట్టిన చీడపీడలాంటి వాడివని విమర్శించారు. తనను అనవసరంగా దుర్భాషలాడిన కడియం శ్రీహరిపై కేసు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. కాగా, పల్లాపై కడియం వ్యాఖ్యలకు నిరసనగా సోడషపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు.