ములుగురూరల్/గోవిందరావుపేట, డిసెంబర్1: విద్యార్థులు చలికి వణుకుతున్నా దుప్పట్లివ్వరా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఆదివారం నియో జకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేశ్, స్థానిక నాయకులతో కలిసి జాకారంలోని సోషల్ వెల్ఫేర్, బండారుపల్లి రెసిడెన్షియల్ గురుకులాలతో పాటు గోవిందరావుపేట మండలంలోని చల్వాయి కస్తూర్బా పాఠశాలను సందర్శించారు.
ప్రభుత్వం అందిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పారిశుధ్యం లోపించడాన్ని గమనించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టకుంటే విద్యార్థులు అనారోగ్యం బారి న పడే ప్రమాదం ఉందని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. వం ట గదులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మెనూపై ఆరా తీసి, నాణ్యత పాటించాలని అన్నారు. ఈ సందర్భం గా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా విద్యాశాఖ మంత్రి లేరని, విద్యా వ్యవస్థను సర్కారు నాశనం చేస్తున్నదని అన్నారు.
రేవంత్‌రెడ్డికి ఇంకా ముఖ్యమంత్రి అయిన మురిపెం పోలేదని, పాలనపై పట్టు కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నదని, వరుస మరణాలు, ఆహార విషతుల్యం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. వంటశాలలు, మరుగుదొడ్లు, మాత్రశాలలు అధ్వానంగా ఉన్నాయని అన్నారు.
కేసీఆర్ నాయకత్వం లో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్‌రెడ్డి రాజకీయ పంతంతో విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 నెలల్లోనే 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, 1200 మంది తీవ్ర అస్వస్థతకు గురవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తల్లి పాత్రలో ఉన్న జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాజకీయ ప్రకటనలు చేస్తూ పిల్లలు, తల్లిదండ్రుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. కాగా, జాకారం, చల్వాయిలోని హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గోవింద్‌నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్, నర్సింహానాయక్, జాకారం మాజీ సర్పంచ్ రమేశ్, మాజీ ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, విజయ్‌రామ్‌నాయక్, అన్న తిరుపతి, గండి కుమార్, రాసమల్ల సురేందర్, కోగిల మహేశ్, భూక్యా జంపన్న, ఆదిరెడ్డి, రాజేందర్, స్వరూప, నాయకులు పూర్ణచందర్, బైకాని ఓదెలు, భూరెడ్డి మధు, బొల్ల ప్రసాద్, రమేశ్, కనకయ్య, బీఆర్ఎస్వీ కేయూ నాయకులు కొనుకంటి ప్రశాంత్, సాయిని రాకేశ్, కొమరం సిద్ధు, సాధబోయిన రాజ్‌కుమార్ ఉన్నారు.
దేశ భవిష్యత్ కర్మాగారాలు గురుకులాలు. అందులో విద్యార్థులను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయాలి. కాస్మోటిక్స్, దుప్పట్లు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. గిరిజన, ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లుగా భావించే ఆశ్రమ పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. మంత్రి సీతక్కకు రాష్ట్రం మొత్తం తిరిగే సమయం ఉంది కాని ఆమె సొంత నియోజకవర్గంలోని గురుకులాలను సందర్శించే తీరిక లేదు.
– జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి