వరంగల్, జూలై 7 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ. 149.29 కోట్ల అభివృద్ది పనులకు బల్దియా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సోమవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనలు, నినాదాల మధ్య ఎజెండా అంశాలు చదివారు. గందరగోళం మధ్యే 23 ఎజెండా అంశాలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. సభ ప్రారంభం కాగానే భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో జరిగిన అవినీతిపై చర్చించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మేయర్ మైక్ కట్ చేశారు. దీంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు. విలీన గ్రామాల్లో 60 గజాల ఇంటికి చెత్త పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి బడ్జెట్లో 1/3 నిధులు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదించింది.
సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. గ్రేటర్లో రూ.149.29 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్లో ఆమోదముద్ర వేశారు. రూ.62.15 కోట్ల బల్దియా సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ప్రతి డివిజన్లో రూ.50 లక్షల పనులు, రూ.24.05 కోట్లతో ఇతర పనులు, రూ.2 కోట్లతో హంటర్ రోడ్డులోని 12 మోరీల జంక్షన్ అభివృద్ధి, రూ. 2 కోట్లతో వీధి దీపాల అభివృద్ధికి కౌన్సిల్లో ఆమోదించారు. రూ. 18.18 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పారు. స్టాంప్ డ్యూటీ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. రూ.41.56 కోట్లతో డివిజన్లలో అభివృద్ధి పనులు, రూ.13.50 కోట్లతో భద్రకాళీ చెరువులో మ్యూజికల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా వచ్చిన రూ. 14 కోట్లలో రూ.6 కోట్లతో ఆస్తి పన్ను అసెస్మెంట్పై సర్వే, రూ. 4 కోట్లతో స్మార్ట్ నీటి మీటర్లు, రూ. 4 కోట్లు నిల్వ వ్యర్థాల శుద్ధీకరణకు ఖర్చు చేయనున్నారు.
బల్దియా కౌన్సిల్ సమావేశం నుంచి పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. భద్రకాళీ పూడికతీత పనుల్లో జాప్యం, అవినీతిపై చర్చించాలని ఇండ్ల నాగేశ్వర్రావు పట్టుబట్టారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారని పలువురు ఆందోళన చేశారు. మాట్లాడుతుంటే అవకాశం ఇవ్వకుండా మైక్‌లు కట్ చేయడాన్ని నిరసిస్తూ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్‌తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, బోయినపల్లి రంజిత్‌రావు, సుంకు నర్సింగ్, చెన్నం మధు, సుంకరి మనీషా, దివ్యారాణి వాకౌట్ చేశారు.
నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు అమలు చేస్తున్నాం. నగరంలోని 33 నాలాలతో పాటు 66 డివిజన్లలోని 340 అంతర్గత డ్రైనేజీల పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. 45 లోతట్టు కాలనీలను గుర్తించి ముందస్తుగా ముంపు నివారణ చర్యలు చేపట్టాం. నయీంనగర్ నాలా విస్తరణ పనులను పూర్తి చేశాం. గ్రేటర్‌లోని 66 డివిజన్లలో సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రేటర్ కార్పొరేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సమష్టిగా ముందుకు పోతున్నాం.
గ్రేటర్ కార్పొరేషన్‌కు ప్రత్యేక వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలి. దీని కోసం ప్రత్యేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై ఈఈ స్థాయి అధికారిని తీసుకోవాలి. పార్టీలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతాం.
నగర అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది. అన్ని డివిజన్ల అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయిస్తున్నాం. నగరాన్ని అభివృద్దిలో ముందుకు తీసుపోయేందుకు కలిసి పనిచేస్తాం. శంకుస్థాపనలు చేసిన పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తున్నాం.
విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. బడ్జెట్లో కేటాయించిన 1/3 నిధులను విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న, అల్ప సంఖ్యాక వర్గాలు నివసించే మురికివాడల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి.