Ex MLA Rajaiah | లింగాల ఘణపురం : కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. బసవగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్ ట్రాలీ, స్మశాన వాటికలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయ, ప్రతి ఎకరాకు గోదావరి జలాలను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, తండాకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించింది కూడా కేసీఆరేనని తెలిపారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేదని కడియం కాంగ్రెస్ మాత్రమే ఉందన్నారు. పాత కాంగ్రెస్ క్యాడర్ మొత్తం దూరమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిపించుకునే స్థితిలో కడియం లేడని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ సూచించిన నిలబెట్టిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ సత్తాను చాటాలని రాజయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవిలి సంపత్, మాజీ ఎంపీపీ చిట్ల ఉపేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చౌతరపెళ్లి శేఖర్, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏదునూరి వీరన్న, దుంబాల భాస్కర్ రెడ్డి, నాయకులు అంతగాల్ల రామచందర్, గండి యాదగిరి, ఉడుగుల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.