గిర్మాజీపేట, నవంబర్ 10: దిక్కులన్నీ పెక్కటిల్లేలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాలనీలన్నీ కదం తొక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ శుక్రవారం నామినేషన్ వేసేందుకు నిర్వహించిన ర్యాలీ.. విజయోత్సవాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో ఎమ్మెల్యే నరేందర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బండా ప్రకాశ్‌తో కలిసి వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. శివనగర్‌లోని తన ఇంటి నుంచి స్టేషన్‌రోడ్ మీదుగా వరంగల్‌చౌరస్తా, జేపీఎన్రోడ్, మండిబజార్, పోచమ్మమైదాన్ సెంటర్, గోపాలస్వామి గుడి జంక్షన్, ఎంజీఎం సెంటర్ వరకు పీరీలు, ఆదివాసీల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, కళాకారుల ఆటపాటలు, కోలాటాల మధ్య పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలిరాగా.. నగరంలో భారీ ర్యాలీ కోలాహలంగా సాగింది. వరంగల్ నగరంలోని రహదారులన్నీ అశేష జనం మధ్య కిక్కిరిసిపోయాయి. పోస్టాఫీస్ జంక్షన్ వద్ద 27వ డివిజన్ నాయకులు, వరంగల్ చౌరస్తా వద్ద కార్పొరేటర్ గందె కల్పన, బీఆర్ఎస్ నాయకులు, మండిబజార్‌లో కార్పొరేటర్ బస్వరాజు శిరీష, గోపాలస్వామి గుడి జంక్షన్లో 24వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే నరేందర్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు ఆకాశమంతా ప్రేమను చూపిస్తూ గులాబీ దండు కదనోత్సాహంతో ముందుకు సాగింది. కార్యకర్తల కేరింతల నడుమ ఓరగల్లు పురవీధులన్నీ జై తెలంగాణ.. జై బీఆర్ఎస్… జయహో నరేందర్… అనే నినాదాలతో హోరెత్తాయి. ఈ సందర్భంగా నరేందర్ ప్రజలకు అభివాదం చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన సెంటర్ వద్ద భారీ గజమాలతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్‌ను అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతించి సత్కరించారు.

వరంగల్: నన్నపునేని నరేందర్ నామినేషన్‌కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా, రాష్ట్ర సరోగసి బోర్డు మెంబర్ హరిరమాదేవి, కార్పొరేటర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా నన్నపునేని వారితో కలిసి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నరేందర్‌ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి బలపర్చారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో కళ్లెదుటే కనిపిస్తున్నదన్నారు. మరోసారి తూర్పు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ గెలుపు తథ్యమన్నారు.