‘ఓ మహాత్మా.. సీఎం రేవంత్‌రెడ్డి మనసు మార్చు.. 420 రోజులైనా ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదు.. వాటిని నెరవేర్చే బుద్ధిని ప్రసాదించు’ అంటూ గాంధీజీని బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతిపిత విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. పలుచోట్ల శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు అలవికాని హామీలిచ్చారని, తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాటి ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు నిరుపేదలను మోసం చేసిందన్నారు. హామీలన్నీ అమలు చేసే వరకు ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 30
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీజీ విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైందని, ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో కోతలు, ఎగవేతలు, ఎదురుచూపులే మిగిలాయని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా వాటిని నెరవేర్చడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కుంటి సాకులు, కొర్రీలతో లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియను సర్కారు ప్రారంభించిందని ఆరోపించారు.