ఎల్కతుర్తి, ఏప్రిల్ 25: వృథాగా పోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో నిర్మించిన చెక్‌డ్యాంలు అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా మరమ్మతులు చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతుండడంతో రైతులు అల్లాడుతున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ని జీల్గుల, దామెర గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యాంలు నిర్మించగా, కొన్నాళ్లకే అవి దెబ్బతినడంతో వరద వృథాగా పోతున్నది. జీల్గుల వా గుకు పైన ఉన్న ముల్కనూర్, జగన్నాథపూర్ నుంచి భారీగా వరద ఈ వాగు ద్వారా కిందికి వెళ్తుండడంతో ఈ వాగుపై 2002లో రాజబోసు బావి వద్ద చెక్‌డ్యాం ను నిర్మించారు. దీని ద్వారా సుమారు 250 ఎకరాల వరకు సాగునీరు అంది పంటలు పండుతాయి.
అలా గే దామెర శివారులో 20 ఏళ్ల క్రితం రూ. 1.5లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాం వల్ల భూగర్భ జలాలు పెరిగి సుమారు 70 ఎకరాల వరకు సాగునీరు అందుతోం ది. అయితే కొద్ది రోజులకే ఈ చెక్‌డ్యాంలు తెగిపోవడంతో చుక్క నీరు నిల్వ ఉండడం లేదు. తద్వారా భూగర్భ జలాలు అడుగంటి యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయి. ఈ విషయంపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం చెక్‌డ్యాం పై భాగంలో భూగర్భ జలాలు అడుగంటి వరి పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేసి తమను, పంటలను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈఈ రవిచందర్‌ను వివరణ కోరగా, ‘గతంలో ఈ చెక్‌డ్యాంలను ఈజీఎస్ పథకంలో నిర్మించారని, వీటి మరమ్మతులకు సంబంధించి తమకు నిర్ధిష్టమైన సూచనలు ఏవీ లేవన్నారు. అయినప్పటికీ తెగిన చెక్‌డ్యాంలను పరిశీలించి మరమ్మతులకు అయ్యే ఎస్టిమేషన్ వేసి పంపించినట్లు’ తెలిపారు.