Warangal | వరంగల్ చౌరస్తా: వైద్య విద్య అవసరాల నిమిత్తం కాకతీయ మెడికల్ కళాశాలకు తెలంగాణ నీట్, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్థీవదేహం అందజేశారు. తిమ్మాపూర్, బృందావన్ కాలనీ నివాసి దాచేపల్లి నరేందర్ (75) అనారోగ్యంతో మరణించారు. కాగా కూతురు దాచేపల్లి రజిని సమాజ హితం కోరి, వైద్య విద్య నిమిత్తం, మెడికల్ కాలేజీకి శరీర దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో పార్థివదేహాన్ని కేఎంసీకి తరలించి, ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డి సమక్షంలో అనాటమీ విభాగానికి అప్పగించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేసి ఇద్దరు అంధులకు చూపును, శరీర దానం చేసి వందల మంది భావి వైద్యులకు వైద్య పాఠం గా మారవచ్చని, అవయవ దానం చేసి ప్రాణదానం చేయవచ్చన్నారు. నేత్ర, అవయవ, శరీర దానం చేయాలనుకునే వారు వివరాల కోసం 8790548706, 9490133650 ద్వారా సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రీమతి రజిని, దాచపల్లి జయప్రకాశ్, సిరికొండ మౌనిక, చారి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్రప్రసాద్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, ప్రధాన కార్యదర్శ జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులు కేదారి, తదితరులు పాల్గొన్నారు.