నర్సంపేట/వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం, జనవరి 14: జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. శనివారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున భోగి మంటలు ఏర్పాటు చేసుకొని భోగి పండ్లను చిన్నారులు, పెద్దలు పోసుకున్నారు. కొత్త వస్ర్తాలు ధరించి పూజలు చేశారు. మహిళలు ఇంటి ముంగిళ్లను శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేశారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పండి వంటలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతున్నది. వర్ధన్నపేట మండలం నుంచి ఐనవోలు జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ప్రజలు భోగి సంబురాల్లో మునిగితేలారు. కాగా, మండల ప్రజలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండ్ల ముంగిళ్లలో మహిళలు ముత్యాల ముగ్గులు వేసి నవధాన్యాలు, రేగు పండ్లు, గరకపోచ, పిండిపూల మొక్కలను వేసి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ముత్తోజిపేట, రాజుపేట, ఇటుకాలపల్లి, ఆకులతండాలో గంగిరెద్దులు సందడి చేశాయి. ఖానాపురంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బుధరావుపేటలో 1వ వార్డులో మాచర్ల యాదగిరి ఆధ్వర్యంలో భోగి మంటలు వేసుకున్నారు. సంక్రాతి పండుగ ప్రతి ఇంట్లో సంతోషాలు నింపాలని ఎంపీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెంకటేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
పల్లెల్లో సంక్రాంతి సందడి
దుగ్గొండి/గీసుగొండ/రాయపర్తి: దుగ్గొండి మండలంలో పండుగ శోభ సంతరించుకుంది. నాచినపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం, కేశవాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి ఆనందంగా గడిపారు. బంధుమిత్రుల రాకతో పల్లెలన్నీ సందడిగా మారాయి. గ్రామ పంచాయతీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో భోగి పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో ఉదయాన్నే భోగి మంటలు వేసి, అందులో ఇళ్లలోని పాత, పాడైన వస్తువులు వేశారు. అంతేకాకుండా రాయపర్తి మండలంలోని 39 జీపీల పరిధిలో ప్రజలు భోగి వేడుకలను వైభవోపేతంగా జరుపుకున్నారు. ఇండ్ల ఎదుట భోగి మంటలు వేసుకొని పాత వస్తువులు, దుస్తులు, సామగ్రిని మంటల్లో వేసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సామూహికంగా నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం ఇళ్లు, వాకిళ్లు, లోగిళ్లను శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ముగ్గులతో అందంగా అలంకరించి గొబ్బెమ్మలు ఉంచి రేగు పండ్లు, నవధాన్యాలు, గరిక పోచలను చేర్చారు. ఇంటిల్లిపాది తలంటు స్నానాలు ఆచరించి సంప్రదాయ వస్ర్తాధారణల్లో స్థానికంగా ఉన్న ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఇండ్లలో చిన్నారులకు రేగి పండ్ల స్నానాలు చేయించి పూలు, పండ్లతో కూడిన భోగి పండ్లను పోస్తూ వేడుకలు చేసుకున్నారు.
భోగి పండ్లు… చిన్నారులకు దీవెనలు
పోచమ్మమైదాన్: సంక్రాంతిలో భాగంగా భోగి పండుగ ఎంతో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇంటి బయట భోగి మంటలతోపాటు కొందరు ఇళ్లల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులను ఉంచి ఆనందింపజేస్తారు. అలాగే, ఇళ్లల్లోని పెద్దవాళ్లు పేరంటాల పేరుతో ఇరుగుపొరుగు వారిని పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి, శక్తిమేరకు బహుమతులు అందజేస్తారు. ఈ మరికొన్ని ఇళ్లల్లో భోగి పండ్లతో చిన్నారులను దీవిస్తారు. సూర్యుడికి ప్రతిష్టాత్మకమైన భోగి పండుగ కావడంతో సూర్యాస్తమయం కాకముందే చిన్నారులపై భోగి పండ్లు పోసి దీవిస్తారు. సూర్యుడి రూపం, రంగు పేరు కూడా రేగు పండ్లకు ఉండడంతో ఈ పండ్లను పవిత్రంగా భావిస్తూ పొద్దున గొబ్బెమ్మల వద్ద వేస్తారు. అలాగే, చిన్నారులపై రేగు పండ్లను చల్లుతారు. అలాగే, చామంతి పూలు, రూపాయి నాణేలు కలిపి, చిన్నారుల తలపై ధారగా పోస్తే ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. దీనివల్ల పిల్లలకు ఆరోగ్యంతోపాటు జ్ఞానం కూడా వస్తుందని భావిస్తారు. ఈ విధానం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నప్పటికీ ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాలకు పాకింది. ఈ సందర్భంగా వరంగల్ దేశాయిపేటలోని లక్ష్మీమెగా టౌన్షిప్లో శనివారం రాత్రి భోగి మంటలు ఏర్పాటు చేశారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్కులో కాలనీవాసులందరూ కలిసి భోగి మంటలు తయారు చేసి, ఆటపాటలతో సందడి చేశారు.