హనుమకొండ, నవంబర్ 18: స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్యాదవ్ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు.
బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదునూరి రాజమౌళి మాట్లాడుతూ చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే బీసీలు 2,428 గ్రామ పంచాయతీలను కోల్పోతున్నారని బీసీ జాక్ జిల్లా కన్వీనర్లు ధారబోయిన సతీశ్, డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకురాలు పద్మజాదేవి, నాయకులు చిన్నాల యశ్వంత్యాదవ్, కెడల ప్రసాద్, కృష్ణకుమార్, సుధాకర్ ముదిరాజ్, గుండు రాజు, తిరుపతి, సనత్, రాజుయాదవ్, ఆకుల విజయ, శివ, హైమావతి, రాము, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.