రాయపర్తి/గిర్మాజీపేట, మే 25 : కనుమరుగవుతున్న తెలుగు ప్రజల గ్రామీణ ప్రాంత బంధాలు, బంధుత్వాలు కళ్లకు కట్టేలా నిర్మితమైన బలగం సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది. ఇందులో ప్ర ధాన భూమిక పోషించిన నటుడు జీవీ బాబు అలియాస్ బలగం బాబన్న (అంజన్న పాత్రధారి) కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివా రం రాత్రి కన్నుమూశారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మం డల కేంద్రంలోని గంగపుత్ర కాలనీకి చెందిన గుడిబోయిన వీరలక్ష్మి-వెంకటయ్య దంపతులకు కుమార్తె, కొడు కు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకును నిరుపేదలైన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. బాబుకు చిన్నతనం నుంచే నాటకాలు, నాటికలు అంటే మక్కువ ఎక్కువని అతడి సహచరులు తెలిపారు. 10వ తరగతి వరకు చదివిన తర్వాత కొంతకాలం పాటు స్థానిక మత్స్యపారిశ్రామిక సంఘంలో సభ్యత్వం తీసుకున్న బాబు కులస్తులందరితో కలిసి చేపల వేటకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బా బుకు వివాహం అయిన తర్వాత వరంగల్‌లోని కాకతీయ కళాశాలలో ఐటీఐ పూర్తి చేశాడు.
అనంతరం టెలివిజన్ (టీవీ) మెకానిక్‌గా వర్క్‌షాప్ పెట్టుకొని వ రంగల్లోని పాపయ్యపేట్ చమన్‌కు మకాం మార్చాడు. గుడిబోయిన బాబు పాపయ్యపేట చమన్‌లో ఉన్నా, అతడి తల్లిదండ్రులు గుడిబోయిన వీరలక్ష్మి-వెంకటయ్య రాయపర్తిలోనే తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. తన స్వగ్రామమైన రాయపర్తిలోని బంధువులు, కులస్తుల ఇండ్లలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు బాబు తరచూ హాజరయ్యేవాడు. బలగం సినిమాతో గొప్ప గుర్తింపును తెచ్చుకున్న బాబు రాయపర్తి వస్తే మాత్రం తమతో చిన్నపిల్లవాడివలె కలిసిపోయేవాడని అతడి స్నేహితులు, సన్నిహితులు తెలిపారు.
కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం, దిల్‌రాజు ప్రొడక్షన్లో వచ్చిన బలగం సినిమాలో హీరో ప్రియదర్శి చిన్నతాతగా జీవీ బాబు నటించి ఆకట్టుకున్నారు. ఈ మధ్యే బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి జీవీ బాబు వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇంతలోనే ఆ యన మృతి చెందడం బాధాకరమని వేణు, ప్రియదర్శి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీవీ బాబు రంగస్థల నటుడు. బలగం సినిమా తర్వా త రజాకార్ సినిమాలో నటించారు. ఆయ న ఇప్పటివరకు 20 సినిమాల్లో నటించినా, బలగం సినిమాతో గుర్తింపు వచ్చిం ది.
బాబు మృతితో వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్, రామన్నపేట ప్రాంతంతో పాటు రాయపర్తిలో విషాదం అలుముకుంది. బాబు మృతిపై జబర్దస్త్ ఫేం, సినీ ఆర్టిస్ట్ రచ్చ రవి, రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, వరంగల్ రంగస్థలం కళాకారుల ఐక్య వేదిక బాధ్యుడు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, ప్రభాకర్, జేఎన్ శర్మ, సాధుల సురే శ్, ఆకుతోట లక్ష్మణ్, కుడికాల జనార్దన్, మాలి విజయ్, షఫీ, జూలూరు నాగరాజు, మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి శతపతి శ్యామల, వరంగల్ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, ఓడపల్లి చక్రపాణి, దేవరాజు, రవీందర్రావు, సదానందాచారి, వనపర్తి రాజేంద్రప్రసాద్, సహృదయ సంస్థ అధ్యక్షుడు గిరిజామనోహర్‌బాబు, కార్యదర్శి వనం లక్ష్మీకాంతరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి సంతాపం ప్రకటించారు.