హనుమకొండ చౌరస్తా, మే 11 : ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 3 సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం జరిగే పాలీసెట్-2025ను మే 13వ తేదీ (మంగళవారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ పరీక్షకు వరంగల్ నగరంలోని 12 కేంద్రాల నుండి 6,424 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే, ఉదయం 10 గంటలకే, అనుమతిస్తారని, విద్యార్థులు 10 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓఎమ్మార్ షీట్‌లోని రెండు వైపులలోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయాల్సి ఉంటుందన్నారు.
విద్యార్థులు తమ వెంట హెచ్‌బీ/2బీ బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావాలని, పరీక్ష ప్రారంభమైన 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరన్నారు. హాల్ టికెట్ మీద ఫొటో లేకపోతే ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు)తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం – 60 మార్కులు, భౌతిక శాస్త్రం – 30 మార్కులు, రసాయన శాస్త్రం – 30 మార్కులు కోసం పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునేవారు అదనంగా జీవశాస్త్రం – 30 మార్కులు పరీక్ష రాయాలని పేర్కొన్నారు.