ములుగు, జూలై 4(నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మరో 7 నెలల్లో మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, నిర్వహణపై ఇప్పటినుంచే సమీక్షలు మొదలుపెట్టింది. దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా హాజరు కానున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులను ఖర్చు చేయనున్నది. ఇందులో భాగంగా రూ.75 కోట్లను జాతర అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో 21శాఖల అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ నెల 3న మేడారంలో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర కోసం రూపొందించిన ప్రతిపాదనలను శాఖల వారీగా చర్చించారు. గత నాలుగు జాతరలకు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు విడుదల చేస్తూ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేస్తూ వస్తున్నది. 2022 మహాజాతర సందర్భంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ ముందుచూపుతో వ్యవహరించి ఎక్కువ మొత్తంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టి నిధులు వృథా కాకుండా భక్తులకు ఉపయోగపడే సౌకర్యాలను కల్పించి జాతరను విజయవంతంగా పూర్తి చేశారు. గత రెండు జాతరలను విజయవంతం చేసిన అనుభవం, అవగాహనతో ఉన్న కలెక్టర్.. వచ్చే జాతరకు కూడా రూ.75కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతీ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్నది. అలాగే ఆది, బుధ, గురువారాలతో పాటు సెలవు దినాల్లో భక్తులు తాకిడి ఉంటున్నది. దీంతో భక్తుల సౌకర్యార్థం శాశ్వత, తాత్కాలిక పనులు చేస్తూ తదనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే పరిశీలన చేసిన అనంతరం నిధులను మంజూరు చేస్తారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ భూములను సేకరించి భక్తుల సౌకర్యార్థం రోడ్లు, విశ్రాంతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలను అధికారులు సిద్ధం చేస్తారు. ప్రతిపాదనల మేరకు సకాలంలో నిధులు మంజూరైతే ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
21శాఖలు.. రూ.75కోట్లు..
2022 మహాజాతరకు రూ.97.97కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఉన్నతాధికారులు పరిశీలించి రూ.75కోట్లను మంజూరు చేసింది. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా గత జాతరల కంటే విశేష రీతిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. దీంతో రాబోయే జాతరలో సైతం 21శాఖల ద్వారా రూ.75కోట్లను ఖర్చు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఇందులో భాగంగా తాగునీటి సరఫరా, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులకు పెద్దపీట వేస్తూ రూ.14.74కోట్లను ప్రతిపాదించారు. పోలీస్ శాఖ ద్వారా భద్రత కల్పించేందుకు రూ.10.50 కోట్లు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రూ.8.28కోట్లు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఖర్చు చేసేందుకు రూ.7.85కోట్లు, జల వనరుల శాఖ ద్వారా 6.11కోట్లు, రెవెన్యూ శాఖ ద్వారా 5.25కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4.35కోట్లు, ఐటీడీఏ పీవో ద్వారా రూ.4కోట్లు, విద్యుత్ శాఖ ద్వారా రూ.3.97కోట్లు, రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.2.80కోట్లు, భక్తుల రవాణా సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ద్వారా రూ.2.25కోట్లు, దేవాదాయ శాఖ ద్వారా రూ.1.50కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రూ.1కోటి, పౌర సంబంధాల శాఖ ద్వారా రూ.50 లక్షలు, పర్యాటక శాఖ ద్వారా రూ.50 లక్షలు, పశుసంవర్థక శాఖ ద్వారా రూ.30లక్షలు, మత్స్యశాఖ ద్వారా రూ.24లక్షలు, ఐసీడీఎస్ ద్వారా రూ.23లక్షలు, అగ్నిమాపక శాఖ ద్వారా రూ.20లక్షలు, అటవీ శాఖ ద్వారా రూ.20లక్షలు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.20 లక్షలను ఖర్చు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు.
జాతర ఏర్పాట్లపై ప్రణాళికలు
భక్తులకు మౌలిక వసతుల కల్పనతో పాటు జాతర ఏర్పాట్ల కోసం అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆర్అండ్బీ శాఖ ద్వారా చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు రోడ్డు మరమ్మతులు, పస్రా-భూపాలపల్లి రహదారికి మరమ్మతులు చేయనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా తాడ్వాయి నుంచి కాల్వపల్లి వరకు ప్రత్యేక మరమ్మతులు, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్‌ల ఏర్పాట్లను చేయనున్నారు. కొత్తూరు నుంచి తాడ్వాయి మీదుగా కన్నెపల్లి వరకు, రెడ్డిగూడెం నుంచి తాడ్వాయి వరకు రోడ్డును మరమ్మతులు చేయనున్నారు. నీటి పారుదల శాఖ ద్వారా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద 12 కొత్త బావులు నిర్మించనున్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా జంపన్నవాగు వద్ద వెల్నెస్ సెంటర్, ఇంచర్ల చిన్నగట్టమ్మతో పాటు చల్వాయి గ్రామం వద్ద టాయిలెట్ బ్లాక్‌తో కూడిన షెడ్ కమ్ డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. సమాచార శాఖ ద్వారా ములుగు, ఏటూరునాగారంలో మీడియా సెంటర్ ఏర్పాట్లుచేయనున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ములుగులో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు.