సుబేదారి, డిసెంబర్ 21: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ప్రతి గ్రామం దావత్‌లతో కిక్కెక్కింది. పల్లె పోరులో భాగంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పంచాయతీ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు గెలుపు కోసం పోటాపోటీగా ఓటర్లను ఆకర్శించుకోవడానికి దావత్లను ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా, ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరిగింది. ఈ 20 రోజుల్లో రూ.307 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులతోపాటు, స్వత్రంత అభ్యర్థులు సైతం పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి, మటన్, చికెన్‌తో దావత్‌లు ఇచ్చారు. గ్రామంలో పలుకుబడిన ఉన్నవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఖరీదైన మద్యం బాటిళ్లతో విందులు ఇచ్చారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఓటర్లను ఆకర్శించడానికి దావత్‌లు ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కొత్త టెండర్ వైన్స్ షాప్‌లకు ఎన్నికల కిక్ తగిలింది. కోట్ల రుపాయాలు అమ్మకాలు జరిగాయి. బార్ షాప్‌లకు తాకిడి పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్‌లు, 107 బార్ షాప్లుండగా రూ. కోట్లలో అమ్మకాలు జరిగాయి. 20 రోజుల్లో రూ. 307 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.