నెక్కొండ, డిసెంబర్ 27: మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్‌ఫేజ్‌లో జిల్లాలోని 223 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చిలోగా వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. నెక్కొండ మండలంలోని పనికర యూపీఎస్, నెక్కొండలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి వరకు మండలానికి రెండు పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం మొదటగా ఆదేశించిందన్నారు. పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొదటి దశలో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. అన్ని పాఠశాలల్లో 90 శాతం వరకు విద్యుత్ పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 20 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తయ్యాయని, 50 శాతం పాఠశాలల్లో మైనర్, మేజర్ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈజీఎస్‌లో చేపడుతున్న ప్రహరీలు, వంట గదులు, మూత్రశాలల పనులకు సంబంధించి 50 శాతం గ్రౌండింగ్ పూర్తయ్యాయన్నారు. మరో పది రోజుల్లో ఈజీఎస్‌లో చేపట్టిన అన్ని పనులు ప్రారంభించేందుకు అవసరమై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మన ఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులకు నిధుల కొరత లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్ గోపి తెలిపారు. ఈజీఎస్‌లో చేపట్టే పనులకు సత్వరమే బిల్లులు అందించేందు యత్నిస్తామన్నారు. పనికర యూపీఎస్‌లో ఏర్పాటు చేసిన డోర్లను సరిచేయాలని ఆదేశించారు. పనికర పాఠశాలలో విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో గోడలపై రాసిన వాక్యాలను, పుస్తకంలోని పాఠాలను చదివించారు. విద్యార్థులు ఇంకా బాగా చదవడం, రాయడంపై దృష్టి సారించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈవో వాసంతి, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంఈవో రత్నమాల, జేడీఏ, మండల ప్రత్యేకాధికారి ఉషాదయాళ్, నెక్కొండ, పనికర సర్పంచ్‌లు సొంటిరెడ్డి యమునా రంజిత్‌రెడ్డి, పింగిళి విజయా మోహన్‌రెడ్డి, నెక్కొండ హైస్కూల్ హెచ్ఎం రంగారావు, ఇంజినీరింగ్ అధికారులు, ఎస్ఎంసీ చైర్మన్లతో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నెక్కొండ జడ్పీహెచ్ఎస్ ప్రహరీ వెంట ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రహరీని ఆనుకొని ఉన్న దుకాణాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ కలెక్టర్‌కు విన్నవించడంతో ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, భూ సమస్యలపై పలువురు నాయకులు కలెక్టర్‌కు విన్నవించడంతో విచారణ చేపట్టాలని ఆయన తహసీల్దార్‌ను ఆదేశించారు.
సంగెం: మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలంలోని పల్లార్గూడ, మొండ్రాయి ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. తరగతి గదుల్లో వెలుతురు కోసం ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ఒకటి నుంచి వెయ్యి వరకు తాను చెప్పిన అంకెలు రాసిన విద్యార్థి అభిషేక్రాజ్ను అభినందించారు. ఇంగ్లిష్‌లో వారాల పేర్లు చదివించారు. అలాగే, రిజిస్టర్‌ను పరిశీలించి స్కూల్‌కు రాని విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్లి పిల్లలు, గర్భిణుల వివరాలు అడిగారు. పిల్లల బరువు, ఎత్తును ఆయన స్వయంగా కొలిపించారు. రేషన్, కోడి గుడ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఒక ట్రేలో ఎన్ని కోడి గుడ్లు ఉంటాయి.. ఒక్కో గుడ్డు ఎంత బరువు ఉంటుందో తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. గదిని పెయింటింగ్‌తో తీర్చిదిద్దాలని, పార్టీషన్ చేయాలని సూచించారు. మొండ్రాయి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. కొంతమంది రాత్రివేళల్లో మద్యం తాగి ఖాళీ సీసాలను ఉన్నత పాఠశాల ఆవరణలో పడేస్తున్నారని, ప్రహరీ ఎత్తు పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేలా కృషి చేయాని గ్రామస్తుడు కక్కెర్ల వీరస్వామి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, ఎంపీడీవో కొమురయ్య, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు కక్కెర్ల కుమారస్వామి, మేరుగు మల్లేశం, గూడ కుమారస్వామి, ఎంపీటీసీ కొనకటి రాణి-మొగిలి ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్, ఎస్ఎంసీ చైర్మన్లు మడత కేశవులు, మల్లేశం, నాయకులు ఇజ్జగిరి అశోక్, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాయపర్తి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఏఈ కామిశెట్టి మురళీకృష్ణ ఆదేశించారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతోపాటు మరమ్మతులను సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పనుల నిర్వాహణలో అలసత్వం, నిర్లక్ష్యాలకు తావులేకుండా చూసుకోవాలని కోరారు. ఆయన వెంటకార్యదర్శి అశోక్‌నాయక్, కాంట్రాక్టర్ పురుషోత్తం, హైస్కూల్ హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి, ఎంపీపీఎస్ హెచ్ఎం పాక పద్మావతి, ఉపాధ్యాయులు ఉన్నారు.