వరంగల్ చౌరస్తా: వ్యక్తిగత కక్షలు, ద్వేషాలతో పట్టణ ఆర్యవైశ్య సంఘంపై వదంతులు చేస్తున్న వారి మాటలు నమ్మవద్దని సంఘ ప్రధాన కార్యదర్శి మాదారపు రాజేశ్వర్ రావు అన్నారు. సంఘం అధ్యక్షుడు అనారోగ్య కారణాల కారణంగా అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని, కొందరు సభ్యులు కార్యవర్గంపైవున్న వ్యక్తిగత కక్షలతో సంఘంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంఘ కార్యకాలాపాలు నిర్వహిస్తున్న ప్రస్తుత కమిటీ పూర్తి భాధ్యతతో సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు.
వార్షిక ఆదాయం రూ.700గా వున్న సంఘాన్ని అభివృద్ధి చేసి, చందాలు వసూళ్లు చేయకుండా నగరం నడిబొడ్డున సుమారు రూ.2 కోట్ల విలువ చేసే భవనాన్ని నిర్మించి, నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయం సంఘానికి సమకూరేలా చేశామన్నారు. పట్టణ సంఘం ఆధ్వర్యంలో 11 పరపతి సంఘాలు, కార్పొరేషన్లు నిర్వహించడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సుమారు 1500 మందికి వ్యాపార అవసరాలకు లోన్లు అందించడం, వివాహాలకు, మృతుల కుటుంబాలకు, విద్యా ఆసవరాలకు, విదేశీ విద్య అవసరాలకు ఆర్థికసాయాన్ని అందించడంతో పాటుగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
త్వరలోనే అన్ని విభాగాలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాల చిట్టాలను సభ్యుల ముందు ఉంచుతామన్నారు. అదే విధంగా త్వరలోనే చట్టాన్ని అనుసరించి నూతన కార్యవర్గ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. దీనికోసం తొమ్మిది మంది సభ్యులతో అడ్ హక్ కమిటీని సైతం ఏర్పాటు చేశామన్నారు.