సుబేదారి, డిసెంబర్22 : అధికార పార్టీ నేతల సపోర్ట్ ఉంది కదా.. అని ఏది చేసినా నడుస్తది అనుకున్నారు. బాధితులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి గోస పుచ్చుకున్నారు. పాపం పండింది.. చేసిన తప్పుడు పనులకు శిక్ష అనుభవించే రోజు వచ్చింది. సెంట్రల్ జోన్ వరంగల్ సబ్ డివిజన్లో పనిచేసి బదిలీ అయిన ఏసీపీ నందింరాంనాయక్, ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి, ఎస్సై విఠల్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేత అనుచరుడు, మాజీ రౌడీషీటర్ ఆదేశాల మేరకు అప్పడు ఏసీపీగా పనిచేసిన నందిరాంనాయక్ పర్యవేక్షణలో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిపై ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి, ఎస్సై విఠల్ ఆర్నెళ్ల క్రితం తప్పుడు కేసు నమోదు చేశారు. బాధితుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. సమగ్ర విచారణ చేయాలని కోర్టు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత వరంగల్ ఏసీపీగా ఉన్న ఏఎస్పీ శుభం సమగ్ర విచారణ చేసి దీంతోపాటు మరిన్ని తప్పుడు కేసులను వారు నమోదు చేసినట్లు తేల్చారు. ఈ నివేదిక మేరకు డీజీపీ ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ గోపిరెడ్డి, ఎస్సై విఠల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ సబ్ డివిజన్లో పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్లు నిబంధనలు ఉల్లంఘించిన తీరును ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ‘రౌడీకి పోలీసు సలాం’, తూర్పులో రౌడీ రాజ్యం’, ‘రౌడీరాజ్.. సెటిల్మెంట్లు-ప్రత్యర్థులపై తప్పుడు కేసులు’, విధులు వదిలి కొండా వెంట వెళ్లి.. వంటి కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఏసీపీ నందిరాంనాయక్తోపాటు మట్టెవాడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపిరెడ్డితోపాటుగా పలువురు ఇన్స్పెక్టర్లపై జూన్ 27న బదిలీ వేటుపడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైపై సస్పెన్షన్ వేటుపడడం అనేది వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సంచలనం రేకెత్తించింది. సస్పెన్షన్ అయిన ఏసీపీ నందిరాంనాయక్ ప్రస్తుతం ములుగు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగంలో, ఇన్స్పెక్టర్ గోపిరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఎస్సై విఠల్ పరకాలలో పనిచేస్తున్నారు.
వరంగల్ తూర్పు నియోజవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ప్రధాన అనుచరుడు మాజీ రౌడీషీటర్ తో అంటకాగి, అత డి ఆదేశాల మేర కు ప్రైవేట్ సైన్యంలాగా సెటిల్మెం ట్లు, తప్పుడు కేసులు నమోదు చేసినందుకే ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు ప డింది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని పోలీసు కమిషనరేట్, తూర్పు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న ది. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి సస్పెండ్ అయిన ఈ ముగ్గు రు అధికారులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.