మహబూబాబాద్ రూరల్, మే 23 : అబార్షన్లు, లింగనిర్ధారణ చట్ట విరుద్ధమని తెలిసినా కొంద రు వీటిని ప్రోత్సహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తున్నది. లింగనిర్ధారణ చేయడంతోపాటు విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ మహిళల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల శివారు బోటిమీద తండాకు చెందిన ఓ మహిళ అబార్షన్ చేయించుకోగా, ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. బోటిమీద తండాకు చెందిన ఓ మహిళ ఆర్ఎంపీ సాయం తో మహబూబాబాద్ పట్టణంలోని క్రాంతి మెమోరియల్ ప్రైవేట్ హాస్పిటల్‌కు అబార్షన్ కోసం వచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా డీఎంహెచ్‌వోకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. వెంటనే వారు తమ టీమ్‌తో హాస్పిటల్‌కు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మహిళ అబార్షన్ కోసం మాత్రలు మింగి అస్వస్థతకు గురైంది.
వెంటనే ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే కడుపులో ఉన్న 23వారాల ఆడ శిశువు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై శుక్రవారం క్రాంతి మెమోరియల్ హాస్పిటల్లో పూర్తి విచారణ చేపట్టారు. గతంలో ఆడపిల్ల ఉందని, వారం రోజుల క్రితం నెక్కొండలోని ఓ హాస్పిటల్లో లింగ నిర్ధారణ చేయిస్తే ఆడపిల్ల పుడుతుందని చెప్పడంతో గ్రామంలోని ఆర్ఎంపీ సహకారంతో పట్టణంలోని క్రాంతి మెమోరియల్ హాస్పిటల్‌కు వచ్చినట్లు ఆమె భర్త నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో రవిరాథోడ్ తెలిపారు. నివేదికను కలెక్టర్‌కు అంజేశామని, ఆయన ఆదేశాల మేరకు క్రాంతి మెమోరియల్ ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో లింగనిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హెచ్చరించారు.
గర్భ విచ్ఛిత్తికి పాల్పడిన ముగ్గురిపై పోలీసు లు కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ దేవేందర్ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలానికి చెందిన ఓ మహిళకు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గర్భవిచ్ఛిత్తి చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తి విచారణ చేపట్టిం ది. డీఎంహెచ్‌వో రవిరాథోడ్ ఫిర్యాదు మేరకు గర్భవిచ్ఛిత్తికి సహకరించిన, చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.