పోచమ్మమైదాన్, నవంబర్ 7: కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనని చేనేత కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టులో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ‘చేనేత భరోసా’ పథకం ప్రకటించినా కాగితాలకే పరిమితమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా అందించిన ’నేతన్న చేయూత’ పథకంలో నగదును కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రెగ్యులర్గా జమ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాయం అందడం లేదని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి మగ్గానికి రూ.30 వేల చొప్పున మంజూరు చేసేవారు. ప్రస్తుతం రూ.24 వేలు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చినా ఆచరణలో అమలు కావడం లేదు.
నెల రోజుల్లో కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని నాలుగు నెలల క్రితం చెప్పినా నేటికీ చేనేత భరోసా అందడం లేదు. చేనేత కార్మికులకు ఆరునెలలకోసారి రూ.9 వేల చొప్పున ఏడాదిలో రూ.18 వేలు, కండెలు చుట్టేవారికి ఆరు నెలలకు రూ.3 వేల చొప్పున ఏడాదిలో రూ.6 వేలు నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపిన సర్కారు దరఖాస్తులు సైతం స్వీకరించింది. అయినా నేటికీ కార్యరూపం దాల్చడంలేదని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేనేత కార్మికులకు పొదుపుతో పాటు ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు గత కేసీఆర్ సర్కార్ అమలు చేసిన త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని కొనసాగిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. నేత కార్మికుల పనిని బట్టి బ్యాంకులో జమ చేసిన మొత్తానికి రెట్టింపు డబ్బులను ప్రతి నెలా అందించాల్సి ఉంది. త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన సర్కారు గత ఏప్రిల్, మే నెలలో మాత్రమే నేతన్న ఖాతాల్లో నగదు జమ చేసింది. అనంతరం జమ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రతి నెలా త్రిఫ్ట్ ఫండ్ పథకంలో నేతన్నలకు బ్యాంకులో నగదు జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.