ఏటూరునాగారం, డిసెంబర్ 12 : ములుగు జిల్లా ఏటూరునాగారంలో సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న బాలిక అస్వస్థతకు గురైంది. వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించి వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామన్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి గగ్గూరి గోపిక గ్రామస్థాయిలో నిర్వహించిన క్రీడల్లో పాల్గొని మండల స్థాయికి ఎంపికైంది. మండల స్థాయి పోటీలు 10వ తేదీ నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. కాగా, బుధవారం కబడ్డీ ఆడిన గోపిక తర్వాత పరుగుపందెంలో పాల్గొని అలసి కుర్చీలో కూర్చుని స్పృహ కోల్పోయింది. కళ్లు మూత పడి నోటి వెంట మాట రాలేదు.
వెంటనే గుర్తించిన పీఈటీలు, సిబ్బంది మండల కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. రెండు గంటల పాటు చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లారు. కాగా, గోపిక రాత్రి స్పృహలోకి వచ్చిందని తండ్రి విక్రమ్ గురువారం తెలిపారు. స్కానింగ్, ఇతర పరీక్షలు చేశారని, వైద్యులు గుండెకు నీరు వచ్చినట్లు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. అయితే బాలిక స్పృహ కోల్పోయినపుడు వైద్య సిబ్బంది ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో పీఈటీ కుమారస్వామి సీపీఆర్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గోగుపల్లి గ్రామానికి చెందిన సోయం అనిత కళ్లు తిరిగి పడిపోయి వాంతులు చేసుకొని అనంతరం కోలుకుంది.