హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 10 : ‘నేడు దేశంలో అణు ఇంధన సహకారం మూడు శాతం కంటే తకువ ఉంది.. ఇది 2050 నాటికి 18 శాతానికి పెరుగనుంది. 2070 నాటికి దేశ నికర జీరో కార్బన్ ఉద్గారాన్ని నెరవేర్చడంలో అణు ఇంధనం ముఖ్య పాత్ర పోషిస్తుంది’ అని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కోమల్కపూర్ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. నిట్‌లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కోమల్ కపూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నిట్ 65వ వ్యవస్థాపక దినోత్సవంలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చేపడుతున్న పనులు, దేశానికి ఉపయోగపడే అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసాచార్య 1959లో ఇన్స్టిట్యూట్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమైన మైలురాళ్ల గురించి వివరించారు.
ఇన్స్టిట్యూట్లో వివిధ కార్యక్రమాల ప్రారంభం గురించి మాట్లాడుతూ ఈ సంస్థలో 13 డిపార్ట్మెంట్లు, ఎనిమిది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను (బీ టెక్) ఇంజినీరింగ్‌లో ఇంజనీరింగ్, సైన్సెస్, మేనేజ్మెంట్లో 35 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు (ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ) ఉన్నాయని చెప్పారు. నిట్‌కు 2007 ఆగస్టులో ‘జాతీయ ప్రాముఖ్యత ఇన్స్టిట్యూట్’ హోదా దక్కిందన్నారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ వరంగల్ నిట్ శంకుస్థాపన అక్టోబర్ 10, 1959న జరిగిందని, ఆర్ఈసీల శ్రేణిలో వరంగల్ నిట్ మొదటిస్థానంలో ఉందని, 2002 సెప్టెంబర్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్‌గా పేరు మార్చారని తెలిపారు. సమాజంలోని ముఖ్యమైన సమస్యలను పరిషరించేందుకు పరిశోధన, ఆవిషరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందించేందుకు రీసెర్చ్ పారును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది 983 పరిశోధన ప్రచురణలు వెలువడ్డాయని, విద్యార్థుల్లో 98 శాతం మంది గత విద్యాసంవత్సరంలో రూ.88 లక్షల మేరకు అత్యధిక ప్యాకేజీ పొందారని తెలిపారు. క్యాంపస్‌లో ప్రయాణానికి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తారని, త్వరలో ఇన్స్టిట్యూట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను అమలు చేస్తామని తెలిపారు.
పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి అవార్డుల ప్రదానం చేశారు. 2023-విశిష్ట పూర్వవిద్యార్థుల అవార్డులను ఐదు విభాగాల్లో అందించారు. బోధన, పరిశోధనలకు సహకరించిన అధ్యాపకులు సైతం నాలుగేళ్లుగా పరిశోధన, బోధన విభాగాల్లో అవార్డులు పొందారు. కొవిడ్ కారణంగా మూడేళ్లపాటు అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించలేదు.
ఈ సందర్భంగా 25 ఏళ్లకు పైగా సేవలందించిన అధ్యాపకులు, సిబ్బందిని సతరించారు. వరంగల్ నిట్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వవిద్యార్థులను అనుసంధానం చేసేందుకు ఎన్ఐటీడబ్ల్యూఏఏ యాప్‌ను ప్రారంభించింది. లాంచ్ సందర్భంగా, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్యామ్ మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్లోని సుమారు 40 వేల మంది పూర్వవిద్యార్థులను కనెక్ట్చేసే లక్ష్యంతో యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వరంగల్ నిట్‌లోని పూర్వవిద్యార్థులు, అధ్యాపకులందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.
1. ఉత్తమ ఫ్యాకల్టీ అవార్డు (ఇంజినీరింగ్)
ప్రొ. పీ రతీష్‌కుమార్ (2020)
ప్రొ. టీ కిషోర్‌కుమార్ (2021)
ప్రొ. శిరీష్ హెచ్ సోనావానే(2022)
2. ఉత్తమ ఫ్యాకల్టీ అవార్డు (సైన్సెస్)
ప్రొ. కే లక్ష్మీరెడ్డి (2020)
ప్రొ. పీ అబ్దుల్ అజీమ్ (2021)
3. ఉత్తమ పరిశోధకుడి అవార్డు (ఇంజనీరింగ్)
ప్రొ. వీ వాసు (2020)
ప్రొ. జీ నాగ శ్రీనివాసులు (2021)
ప్రొఫెసర్ వీవీ మణి (2022)
ప్రొ. శిరీష్ హెచ్ సోనావానే (2023)
4. ఉత్తమ పరిశోధకుడి అవార్డు (సైన్సెస్)
ప్రొ. కేవీ గోబీ (2020)
ప్రొ. పీవీ శ్రీలక్ష్మి (2022)
ప్రొ. పీ అబ్దుల్ అజీమ్ (2023)
5. యువ పరిశోధకుడు (ఇంజినీరింగ్)
ప్రొఫెసర్ కేవీఆర్ రవిశంకర్ (2020)
ప్రొ. సయ్యద్ ఇస్మాయిల్ (2021)
ప్రొ. టీ వినయ్ కుమార్ (2022)
ప్రొ. జీ రాఘవేంద్ర (2023)
6.యువ పరిశోధకుడు (సైన్సెస్)
ప్రొ. కే హరి ప్రసాద్ (2020)
ప్రొఫెసర్ వీ జయలక్ష్మి (2021)
ప్రొ. ఎస్ నాగరాజన్ (2023)
1. ప్రొఫెషనల్ ఎక్సలెన్స్-అకడమిక్ అండ్ రీసెర్చ్ డాక్టర్ కౌశిక్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, రాంచీ, జార్ఖండ్, బీటెక్ (మెక్)-1990.
2. ప్రొఫెషనల్ ఎక్సలెన్స్-ఇండస్ట్రీ/కార్పొరేట్ డాక్టర్ శ్రీనివాస్ మంత్రాల హెడ్, ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నకాల లాజిస్టిక్స్ కారిడార్, వలాన్ ఇంటర్నేషనల్, మొజాంబిక్ బీటెక్ (సివిల్) – 1986.
3. ప్రొఫెషనల్ ఎక్సలెన్స్-పరిశ్రమ/కార్పొరేట్ వీఎన్ఆర్ నాయుడు, చీఫ్ జనరల్ మేనేజర్, భారత ప్రభుత్వ మింట్ హైదరాబాద్, బీటెక్ (ఎంఈటీ) – 1993.
4. పబ్లిక్ సర్వీస్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ముత్యాల రాజు రేవు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీటెక్(ఈఈఈ) – 2002
5. పబ్లిక్ సర్వీస్-సోషల్ , కమ్యూనిటీ సర్వీస్ రాజా శ్రీనివాసరావు అయిత లీడ్ ప్రాజెక్ట్ లైట్-అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అబుదాబి (ఏడీఎన్‌వోసీ ఆఫ్ షోర్) బీటెక్ (సివిల్) -1994.