వరంగల్, జూలై 12 : వరుసగా ఐదో రోజుల నుంచి కురుస్తున్న జోరు వర్షాలతో వరద ముంచెత్తుతోంది. ఇప్పటికే చెరువులు, చిన్న చిన్న రిజర్వాయర్లు, వాగులు నిండిపోగా రోడ్లు, పంట పొలాల్లోంచి వరద పారుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఈసారి రైతులు ఎక్కువగా పత్తి సాగు చేయగా నాలుగు రోజుల నుంచి చేన్లు నీట మునిగి ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్‌లోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురవగా హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం అందుకుతండా, వెంచరామి గ్రామాల మధ్య మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాటారం మండలంలో బొప్పారం వాగు ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భూపాలపల్లి మండలంలోని వజినేపల్లిలో ఏడు ఇండ్ల గోడలు కూలిపోయాయి. కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దంపేట బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో పలిమెల మండలం లెంకలగడ్డకు చెందిన చెన్నూరి రజిత అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా అకడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ రెస్యూ సిబ్బంది ఆమెను వాగు దాటించి భూపాలపల్లి దవాఖానకు తరలించారు. వర్షాల కారణంగా హనుమకొండ, కాళేశ్వరం, మంచిర్యాల, గోదావరిఖని మినహా దారులు సక్రమంగా లేని గ్రామాలకు బస్సులు నిలిపివేశారు. భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 15 పునరావాస కేంద్రాల్లో లోతట్టు గ్రామాల్లోని 800మందికి పునరావాసం కల్పించారు. ములుగు మండలంలోని జాకారం, బండారుపల్లి, లోకం చెరువులు మత్తడి పడి నీరంతా రామప్ప చెరువులోకి చేరడంతో నీటి మట్టం 27.6 అడుగులకు చేరింది. జిల్లావ్యాప్తంగా 10.97 సెం.మీ వర్షం కురవగా అత్యధికంగా వెంకటాపూర్(నూగూరు)లో 16.22 సెంటీమీటర్లుగా నమోదైంది. వరంగల్ నగరంలోని పలు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి.
పెరిగిన గోదావరి ఉధృతి
గోదావరి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. సోమవారం కాస్త నెమ్మెదించినా మంగళవారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం 12.16 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అలాగే ఉదయం తక్కువగా ఉన్న ప్రవాహం సమ్మక్క బరాజ్ వద్ద సాయంత్రం పెరిగింది. ఎగువ నుంచి 8లక్షల 40వేల క్యూసెక్కులు వస్తుండడంతో 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తాడ్వాయి మండలం కొంగలమడుగులో అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడిని వాగు దాటిస్తున్న గ్రామస్తులు
కాటారం మండలం గంగారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న అలుగు వాగు