వరంగల్, ఏప్రిల్ 11 : భానుడి భగభగతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటివరకు సాధారణ పరిస్థితి ఉండగా శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో రహదారులపై వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎండ నుంచి ఉపశమనం కోసం బల్దియా రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేసినా అవి నామమాత్రంగా ఉన్నాయి. చాలాచోట్ల నీళ్లు పోసేందుకు మనుషులను నియమించలేదు. తడకల షెడ్ వేసి, బ్యానర్ మాత్రం కట్టారు. దాహం తీర్చే చలివేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా నగరంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ఎండాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు అగ్ని పరీక్ష తప్పడం లేదు. వేడి నుంచి ఉపశమనం కోసం నగరంలోని సిగ్నల్ పాయింట్స్ వద్ద సన్ షేడ్ గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాల్సిన బల్దియా అధికారులు అలాంటి ఏర్పాట్లేవీ చేయడం లేదు. దీని వల్ల మిట్ట మధ్యాహ్నం ఎండకు మాడిపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద 60 నుంచి 120 సెకన్ల వరకు ఆగాల్సి వస్తోందని ఆ సమయంలో చల్లదనం కోసం నెట్ వేయాలని ఎండ వేడి నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేయగా వరంగల్లో కూడా గతంలో వలె ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద గ్రీన్ నెట్లు అమర్చే విషయమై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.
దామెర, ఏప్రిల్ 11 : ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ఓ తాపీమేస్త్రి మృతి చెందా డు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. హనుమకొండ పోచమ్మకుంట సగరవీధికి చెందిన వేముల మల్లేశం(46) దామెరకు చెందిన గిద్దెలూరి కొమురు భవన నిర్మాణ పనుల కోసం గురువారం వెళ్లాడు. భవనంపై పని చేస్తుండగా వడదెబ్బ తగలడంతో స్థానికులు వరంగల్లోని ఓ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లేశం భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.