ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

- నాలుగు స్థాయిల్లో ఇన్చార్జిల నియామకం
- ప్రతి సెంటర్‌కు ఒక వీఆర్వో లేదా వీఆర్ఏ
- క్లస్టర్ స్థాయిలో డీటీసీఎస్‌లు, ఏపీఎంలు
- మండలానికి స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు
- డివిజన్లో ఆర్డీవోలు, ఏడీఏలకు బాధ్యతలు
- ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ
వరంగల్ రూరల్, నమస్తేతెలంగాణ: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. సెంటర్, క్లస్టర్, మండల, డివిజన్ స్థాయిల్లో ఇన్చార్జిలను నియమించారు. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 1,31,656 ఎకరాల్లో వరి సాగు కాగా, 2,78,658 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాలు మినహా రైతుల నుంచి 2.10 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 179 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆమోదించగా, ప్రస్తుతం 174 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ఆర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాలో 76 రైస్ మిల్లులకు కేటాయించాలని నిర్ణయించి పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ మిల్లులను కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేశారు. గురువారం వరకు 174 సెంటర్లలో 32,550 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్‌రావు తెలిపారు.
ఇన్చార్జిల నియామకం
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో నాలుగు స్థాయిల్లో ఇన్చార్జిలను కలెక్టర్ నియమించారు. సెంటర్, క్లస్టర్, మండల, డివిజన్ స్థాయిలో సదరు ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సెంటర్‌ను సహకార, గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ శాఖ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. రైతులకు గన్నీ సంచులు అందజేయడం, తేమ శాతం కొలవడం, తూకం వేయడం, కంప్యూటర్లలో నమోదు, ట్రక్ షీట్లు జారీ చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సెంటర్ల నుంచి రైస్‌మిల్లులకు తరలించడం.. ఇలా అన్నింటిని ఆయా సెంటర్‌కు సంబంధించిన శాఖల అధికారులు పరిశీలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం ఇన్చార్జిగా వీఆర్వోలు, వీఆర్ఏలు వ్యవహరిస్తున్నారు. 179 కొనుగోలు కేంద్రాలను 28 క్లస్టర్లుగా విభజించారు. వీటికి ఇన్చార్జిలుగా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు(డీటీసీఎస్), ఏపీఎంలు, సీనియర్, జూనియర్ ఇన్స్పెక్టర్లు 28 మంది నియమితులయ్యారు. మండలస్థాయిలో ఆయా మండలం ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్లు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలు, ముగ్గురు వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏడీఏ) ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు ఏఈవో కూపన్లు జారీ చేస్తున్నారు. ఈ కూపన్లు పొందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి మద్దతు ధరకు విక్రయిస్తున్నారు.
పేర్ల నమోదులో జాప్యం
కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల పేర్లను కంప్యూటర్లలో నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండడం వల్ల సమస్య ఉత్పన్నమవుతున్నది. రైతులకు డబ్బుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ ఏడాది కొత్తగా ఏఎంసీలకు కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మరికొన్ని ఇతర సెంటర్లలో సమస్య నెలకొన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. సెంటర్లలో ధాన్యం అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా సెంటర్ల నిర్వాహకులు కంప్యూటర్ (ఓపీఎంఎస్)లో వివరాలను నమోదు చేయడంలో జాప్యం చేస్తుండగా రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. గురు, శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పరకాల, పర్వతగిరి తదితర మండలాల్లోని వివిధ సెంటర్లను సందర్శించి ధాన్యం కొనుగోలు, రికార్డుల నిర్వహణ, ధాన్యం అమ్మిన రైతుల పేర్లను కంప్యూటర్లో నమోదు చేయడాన్ని పరిశీలించారు. సెంటర్ల నిర్వహణలో అవగాహన, అనుభవం ఉన్న వారికి ఆయా సెంటర్లో రైతుల పేర్లను కంప్యూటర్లో నమోదు చేసే బాధ్యతలు అప్పగించారు. సమస్య పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు. పౌరసరఫరాల సంస్థ డీఎం భాస్కర్‌రావు ఆయన వెంట ఉన్నారు.
తాజావార్తలు
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్
- సముద్రాలను భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం