ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Nov 28, 2020 , 02:26:16

ఆ బియ్యం పక్కన పెట్టారు!

ఆ బియ్యం పక్కన పెట్టారు!

  • ఏనుమాముల గోడౌన్‌ను సందర్శించిన అధికారులు
  • దుర్గంపేట నుంచి వచ్చిన రీసైక్లింగ్‌ రైస్‌ పరిశీలన
  • 270 క్వింటాళ్ల బియ్యం పక్కన పెట్టించిన డీఎం
  • బియ్యం బస్తాలకు ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ మార్కింగ్‌
  • రీఅనాలసిస్‌కు టీఏ కోసంకమిషనర్‌ను కోరిన డీఎం
  • పీడీఎస్‌ రైస్‌ దందాలో పాత్రధారులపై సీపీ ఆరా 

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : దుర్గంపేట వద్ద ఓ రైస్‌మిల్లర్‌ పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు పంపిన కేసు విచారణలో ముందడుగు పడింది. శుక్రవారం అధికారులు వరంగల్‌ ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌ను సందర్శించారు. సదరు రైస్‌మిల్లర్‌ దుర్గంపేట నుంచి ఈ గోడౌన్‌కు పంపిన బియ్యం నిల్వలను పరిశీలించారు. అందులో రేషన్‌ బియ్యమనే ఆరోపణలు గల 270 క్వింటాళ్లను  బెడ్‌లో నుంచి పక్కన పెట్టించారు. చౌక డిపోలకు పంపకుండా వీటికి మార్కింగ్‌ చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుర్గంపేట గ్రామం వద్ద బహిరంగ ప్రదేశంలో అర్బన్‌ జిల్లాలోని ఓ రైస్‌మిల్లు స్టిక్కర్‌తో కూడిన సంచుల్లో ఉన్న 130 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ను ఈ నెల 13న పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు ఇదే రైస్‌మిల్లు యజమాని దుర్గంపేట నుంచి పీడీఎస్‌ రైస్‌ తీసుకెళ్లి సీఎంఆర్‌ కింద ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లో దింపాడని విచారణలో తేలిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో బాధ్యులైన వ్యక్తులతో అవగాహన కుదుర్చుకుని పోలీసులు విచారణలో ముందుకు వెళ్లడం లేదని  పోలీస్‌ కమిషనర్‌(సీపీ) ప్రమోద్‌కుమార్‌ దృష్టికి రావడంతో ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌పై నాలుగు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ ఏనుమాములలోని గోడౌన్‌కు దుర్గంపేట నుంచి తరలించిన బియ్యాన్ని రీఅనాలసిస్‌ చేసి తమకు నివేదిక అందజేయాలని పౌరసరఫరాల సంస్థ అర్బన్‌ జిల్లా మేనేజర్‌(డీఎం) కృష్ణవేణికి లేఖ రాశారు. ఈ మేరకు రీఅనాలసిస్‌ కోసం ఒక టీఏను కేటాయించాలని డీఎం కృష్ణవేణి  పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు లెటర్‌ పంపారు.  కమిషనర్‌ స్పందనపై చర్చ జరుగుతున్న తరుణంలో శుక్రవారం డీఎం కృష్ణవేణి, ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ ఏనుమాములలోని గోడౌన్‌ను సందర్శించారు.

పక్కన పెట్టించి, మార్కింగ్‌..

ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు రైస్‌మిల్లర్లు డెలివరీ చేసే సీఎంఆర్‌ ప్రజా పంపిణీ కోసం ఎప్పటికప్పుడు చౌకడిపోలకు తరలిపోతుంది. ఈ నేపథ్యంలో దుర్గంపేట నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లా రైస్‌మిల్లర్‌ సీఎంఆర్‌ కింద డెలివరీ చేశారని పేర్కొంటున్న ఏనుమాముల గోడౌన్‌లోని 270 క్వింటాళ్ల బియ్యం చౌకడిపోలకు తరలిపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. డీఎం కృష్ణవేణి, ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ గోడౌన్‌లో బెడ్‌ మధ్యలో ఉన్న 270 క్వింటాళ్ల బియ్యం బస్తాలను బయటకు తీయించారు. ఈ బస్తాలను గోడౌన్‌లో వేరుగా పక్కన పెట్టించి, విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ ముట్టుకోకుండా 270 క్వింటాళ్ల బియ్యంతో ఉన్న బస్తాలకు మార్కింగ్‌ చేశారు. పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ టీఏను కేటాయించగానే గోడౌన్‌లో పక్కన పెట్టించిన ఈ బియ్యాన్ని రీఅనాలసిస్‌ చేయనున్నట్లు డీఎం వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో రీఅనాలిసిస్‌ జరిగితే నివేదిక ఆధారంగా కేసు విచారణలో ముందుకు వెళ్లొచ్చనే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. దుర్గంపేటలో రీసైక్లింగ్‌ చేసి సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్‌ డెలివరీ చేసిన బియ్యం క్వాలిటీ పరిశీలించి ఫైనల్‌ ఆక్సెప్టెన్సీ ఇచ్చిన ఏనుమాముల గోడౌన్‌ టీఏపై చర్యలపై కూడా రీఅనాలసిస్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్వాలిటీ పరిశీలించి ఫైనల్‌ ఆక్సెప్టెన్సీ ఇచ్చిన టీఏకు తెలియకుండా దుర్గంపేట నుంచి వచ్చిన రీసైక్లింగ్‌ బియ్యం ఏనుమాముల గోడౌన్‌లోకి చేరే అవకాశం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం రీఅనాలసిస్‌పై ఉత్కంఠ నెలకొంది.

పీడీఎస్‌ రైస్‌ బిజినెస్‌పై ఆరా

దుర్గంపేట కేసుతో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పీడీఎస్‌ రైస్‌ బిజినెస్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దందాకు సంబంధించి సీపీ ప్రమోద్‌కుమార్‌ ఆరా తీసినట్లు తెలిసింది. పీడీఎస్‌ రైస్‌ సేకరణ నుంచి మొదలుకుని పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లోకి చేరుకునే వరకు బియ్యం వ్యాపారులు, పాసింగ్‌ ఏజెంట్లు, రైస్‌మిల్లర్లలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఆయా స్థాయిలో వీరికి సహకరిస్తున్నదెవరు అనేది పోలీసుశాఖలోని కొందరి ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. మొత్తానికి రైస్‌మిల్లర్లు పలువురు ప్రభుత్వం తమకు కేటాయిస్తున్న ధాన్యాన్ని అధిక లాభాల కోసం మార్కెట్‌కు తరలించి దాని స్థానంలో పీడీఎస్‌ రైస్‌ను సీఎంఆర్‌ కింద పౌరసరఫరాల సంస్థకు డెలివరీ చేస్తున్నారని సీపీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. పీడీఎస్‌ రైస్‌ దందాకు సహకరిస్తున్న వారిలో పోలీసులు కూడా ఉన్నారని ఆయన గుర్తించినట్లు సమాచారం. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలో ములుగు మండలంలోని ఓ గ్రామం, మల్లంపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రేగొండ, చిట్యాల, వరంగల్‌ అర్బన్‌లోని హసన్‌పర్తి, చింతగట్టు, ఎల్కతుర్తి, కమలాపురం, మహబూబాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పీడీఎస్‌ రైస్‌ బిజినెస్‌ చేస్తున్న వ్యాపారుల చిట్టాను పోలీసుశాఖలోని నిఘా వర్గాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. సదరు వ్యాపారులు తమ బిజినెస్‌కు సహకరించిన వారిలో ఎవరెవరికి ముడుపులు అందజేస్తున్నారనే వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. 


logo