ఇతర పంటల వైపు మొగ్గు
మంచిశనగ, బుడ్డ శనగ, వేరుశనగ, పెసర, నువ్వులు, బబ్బెర్లు, కూరగాయల సాగు
విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు
నర్సంపేట, డిసెంబర్ 11 : ఈ యాసంగిలో వరి వేస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన రైతులు ఇతర పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గురించి తెలుసుకుని మరీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో బావుల కింద మంచిశనగ, బుడ్డ శనగ, వేరుశనగ, పెసర, నువ్వులు, బబ్బెర్లు, కూరగాయలు పెద్ద ఎత్తున పండిస్తున్నారు. మెట్ట పంటల సాగుతో కలిగే లాభాలపై వ్యవసాయాధికారులు అన్నదాతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల సూచనలతో రైతులు కూడా వరికి బదులు ఇతర పంటల సాగుకు ముందుకు వస్తున్నారు.
యాసంగిలో ఇతర పం టల సాగుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. వానకాలం వరి ధాన్యం ప్రస్తుతం చేతికి వస్తోంది. ధా న్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. యాసంగిలో వరి సాగు చేయొద్దని వ్యవసాయాధికారుల పిలుపుతో రైతులు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం జ లాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నా, తైబందీలు ఖరారు చేయలేదు. మెట్ట పంటలకే నీరందిస్తామని చెబుతున్నారు. రైతులు కూడా మంచిశనగ, బుడ్డ శనగ, వేరుశనగ, పెసర, నువ్వులు, బబ్బెర్లు, కూరగాయల సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, లాభాలు వచ్చే పంటల వైపు మళ్లుతున్నారు.
జలాశయాల్లో సమృద్ధిగా నీరు..
జలాశయాల్లో సమృద్ధిగా సాగునీరు అందుబాటు లో ఉంది. వానకాలం సాగు ముగిసిన తర్వాత కూడా పాకాల, రామప్ప, మాదన్నపేట, కోపాకుల తదితర జలశయాలతో పాటు, చిన్న చెరువులు, కుంటల్లోనూ నీరు ఉంది. ఈ నీటితో ప్రతి చెరువు ఆయకట్టులో సా గు చేయడానికి అనువైన పంటలను పరిశీలిస్తున్నారు. బావులు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే మెట్ట పంటల సాగు చేపట్టారు. బబ్బెర్లు, వేరుశనగ, మొక్కజొన్న, పజ్జొన్న పంటలను సాగు చేశారు. వరి కోత పనుల వల్ల చెరువుల కింద యాసంగి పంటల సాగు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. రైతులు విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. కొంత మంది జనుముతో పాటు కూరగాయల పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
అవగాహన సదస్సులు..
ఇప్పటికే వ్యవసాయాధికారులు మెట్ట పంటలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేశారు. ఎక్కు వ డిమాండ్, మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంటలను సాగు చేస్తే మేలు అని చెబుతున్నారు. గత సంవత్సరం యాసంగిలో నర్సంపేట డివిజన్లోనే 37 వేల ఎకరా ల్లో వరి పంట సాగు చేశారు. రెండేండ్ల కింద 25 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం 40 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయడానికి నీరు అందుబాటులో ఉన్నా, వ్యవసాయాధికారుల సూచనలతో రైతులు దూరంగా ఉంటున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..ఏడీఏ శ్రీనివాసరావు
రైతులకు మెట్ట పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. యాసంగిలో వరి సాగుచేసి ఇబ్బందులు పడవద్దని చెబుతున్నాం. నువ్వులు, బబ్బెర్లు, పెసర్లు, వేరు శనగ, మంచి శనగ, బుడ్డశనగ పంటలకు ఈసారి మార్కెట్లో డిమాండ్ ఉంది. రైతులు తమ భూమికి ఏది అనువుగా ఉంటుందో చూసుకుని సాగు చేస్తే మంచిది. దీనిపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయాధికారులతో సదస్సులు నిర్వహిస్తున్నాం.
మెట్ట పంటల సాగుతో లాభం..