జిల్లాలో దంచికొట్టిన వాన
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం
స్తంభించిన జనజీవనం.. పొంగుతున్న వాగులు, వంకలు
మత్తడి దుంకుతున్న చెరువులు
జలమయంలో లోతట్టు ప్రాంతాలు
నాచినపల్లి ఈదుల చెరువులో పడి ఒకరి మృతి
సంగెంలో అత్యధికంగా 14.6 సెం.మీ వర్షపాతం
అధికారయంత్రాంగం అప్రమత్తం
కంట్రోల్ రూం నంబర్లు 18004253424, 9154252937
సమస్యలుంలే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచన
వరంగల్, సెప్టెంబర్ 6(నమస్తేతెలంగాణ);జిల్లాలో వర్షం కుండపోతగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడితెరిపిలేకుండా పడింది. ఒక్కోసారి దంచికొడుతూ.. విరామం ఇచ్చినట్లుగా ముసురుకుంటూ వివిధ ప్రాంతాలను ముంచెత్తింది. భారీ వర్షంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే నిండి ఉన్న చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పొద్దంతా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. కాగా మరో రెండు రోజుల పాటు భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడ సమస్యలున్నా కంట్రోల్ రూం 18004253424, 9154252937 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించింది.
ఎడతెరిపిలేని వర్షంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు కలెక్టర్ బీ గోపి మండలానికో ప్రత్యేకాధికారిని నియమించారు. సోమవారం జిల్లావ్యాప్తంగా వాన దంచికొట్టింది. వరదతో గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. పలు చెరువులు మత్తడి పోశాయి. వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. జిల్లాలో అత్యధికంగా సంగెం మండలంలో 14.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, చెరువు మత్తడి ప్ర వాహం దాటే ప్రయత్నంలో దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామస్తుడు రెడ్డి వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హుటాహుటిన నాచినపల్లి గ్రామాన్ని సందర్శించి జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చారు. నాచినపల్లి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వరద నీరు ప్రవహిస్తున్న కల్వర్టులు, కాజ్‌వేల మీదుగా రాకపోకలు సాగకుండా అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటుకు ఆదేశించారు. సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ కంట్రోల్‌రూంలో విధులు నిర్వర్తించేందుకు వీఆర్వోలను నియమించారు. ప్రతిరోజు ముగ్గురు 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూం లో రెండు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. 1800 425 3424, 9154252937 నంబర్లు పనిచేస్తున్నట్లు ప్రకటించారు. కంట్రోల్ రూం 24 గంటలు పనిచేయనుందని, ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సహా యం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒక రి చొప్పున ప్రత్యేకాధికారులుగా కలెక్టర్ నియమించారు. డీ మురళీధర్‌రావు (గీసుగొండ), బీ రవీందర్ (సంగెం), ఆర్ శ్రీనివాస్‌రావు (దుగ్గొండి), ఎస్కే జహీరొద్దీన్ (నల్లబెల్లి), జీ జీవరత్నం (నర్సంపేట), ఎం అశోక్ (ఖానాపు రం), ఎం బాలకృష్ణ (చెన్నారావుపేట), దేవేందర్ (నెక్కొండ), బీ సంజీవరెడ్డి (పర్వతగిరి), వీ సురేశ్ (వర్ధన్నపేట), పీ నరేశ్‌కుమార్ (రాయపర్తి)తో పాటు ఎంఎం న ర్సింహస్వామి, ఎ నర్సింహస్వామి ఉన్నారు. వీరి ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ బీ గోపి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్‌గా ఉండేలా, బయటకు రాకుండా చూడాలన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించాలన్నారు. ఎక్కడైనా కాలనీలు జలమయమైతే బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వర్షం పడుతున్న సమయంలో కరంటు స్తంభాల పరిసరాల్లోకి ప్రజలు వెళ్లొద్దని సూచించారు. చెరువులకు గండి పడే పరిస్థితి కనపడితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. శిథిలావస్థ ఇండ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలఅన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.