నెరవేరిన ‘ప్రగతి’ లక్ష్యం
పల్లె దారిద్య్రాన్ని తరిమిన సంకల్పం
రెండేళ్లలోపే గ్రామాల్లో ఎంతో మార్పు
ప్రతి ఊరిలో వైకుంఠధామం..
పల్లెపల్లెనా ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
ఊరూరా డంప్ యార్డుల వినియోగం
ఆరు జిల్లాల్లో వంద శాతం పనులు పూర్తి
వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అవును.. ‘పల్లె ప్రగతి’ కొత్త చరిత్ర రాస్తున్నది. దశాబ్దాలుగా చీకట్లలో మగ్గిన పల్లెల్లో కొత్త వెలుగులు నింపింది. రెండేళ్ల క్రితం వరకు ఊరంటే పాత ఇండ్లు.. పాడువడ్డ బావులు.. బొందలు పడి మురుగు పారే దారులు.. చెత్తకుప్పలు, మురికి కూపాలతో నిండిన వీధులు.. దోమలు, ఈగలు, క్రిమికీటకాలు ముసురుకున్న పరిసరాలు.. ఎటు చూసినా రొచ్చు కనిపించేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో రెండేళ్లలోనే ఏ గ్రామం చూసినా పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో వందశాతం వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు పూర్తయి ఊర్ల రూపురేఖలే మారిపోయాయి. అద్దాల్లాంటి రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, ఆహ్లాదకర వాతావరణం పంచేందుకు పచ్చని చెట్లు, కాసేపు సేదతీరేందుకు ప్రకృతివనాలు, చివరి గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేందుకు వైకుంఠధామాలతో ప్రతి పల్లె కొత్తగా కనిపిస్తున్నది.
పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమగ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దేశించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శనీయంగా అభివృద్ధిని నమోదు చేశాయి. నగరాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి.
వంద శాతం వైకుంఠధామాలు..
మనిషి జీవితం ఎలా ఉన్నా చివరి మజిలీ ప్రశాంతంగా పూర్తి కావాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి ఊరి లో వైకుంఠధామాలు(శ్మశానవాటిక) నిర్మిస్తున్నది. మనిషి చనిపోయిన సందర్భాల్లో అంత్యక్రియల కోసం భూమి లేనప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికలున్నా మౌలిక వసతులు లేకపోయేవి. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూ రల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణం వంద శాతం పూ
ర్తయింది. మొత్తం 1688 పంచాయతీలుండగా 1619 వైకుంఠధామాలు ని ర్మించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది.
ఊర్లు శుభ్రం..
పల్లెలను స్వచ్ఛతకు కేంద్రాలుగా మార్చాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ డంపింగ్ యార్డులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఊరిలో నిరంతరం పారిశుధ్య నిర్వహణ ఉండాలని జీపీ కార్మికుల వేతనాన్ని రూ.8500కు పెంచారు. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామాలు శుభ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొదించా రు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ట్రాలీని సమకూర్చి చెత్తను ఊరి అవతలికి తరలిస్తున్నారు. రోజువారీగా సేకరించే చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి కంపోస్టు ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. 1688 పంచాయతీలన్నింటిలోనూ డంపింగ్‌యార్డుల నిర్మాణం పూర్తికాగా, కంపోస్టు ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. దీంతో ఊర్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి.
పల్లెల్లో ఆహ్లాదం..
గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకర వాతావారణం అందించేందుకు ప్రతి ఆవాసం లో పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. ఆరు జిల్లాల పరిధిలోని పంచాయతీల్లో 2738 ఆవాసాలుండగా 2700 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పూర్తయింది. అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో మొక్కలు పెరిగాయి. పల్లె ప్రకృతి వనాలు ఊర్లకు కొత్త అందాలను తెచ్చాయి. వరంగల్ అర్బన్, జనగామ, ములుగు జిల్లాల పరిధిలో వంద శాతం పల్లె ప్రకృతి వనాలు పూర్తికాగా, మహబూబాబాద్ జిల్లాలో 99.72 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 97.70 శాతం, వరంగల్ రూరల్‌లో 95.50 శాతం పూర్తయ్యాయి.