రూ.105 కోట్ల పనులకు టెండర్లు
రూ.77 కోట్లతో కొత్త ప్రతిపాదనలు
ప్రభుత్వానికి పంపించిన జీడబ్ల్యూఎంసీ అధికారులు
వరంగల్, సెప్టెంబర్ 2 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు నివారణకు అధికారులు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ముంపు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నగరానికి వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్, ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో విస్తరించనున్న నగరంతో పాటు పెరిగే జనాభాకు తగినవిధంగా డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రస్తుత నాలాల విస్తరణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో గ్రేటర్ అధికారుల నగరంలోని ప్రధానమైన నాలుగు నాలాల విస్తరణ చేపట్టారు. నాలాలపై ఆక్రమ కట్టడాలను కూల్చివేశారు. నగర ముంపు నివారణకు ప్రణాళికలు చేసి రూ.105 కోట్ల పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. మళ్లీ భారీ వర్షాలు రావడంలో నగరంలోని అనేక కాలనీలు ముంపునకు గురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.77 కోట్లతో కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తుందని, వెంటనే టెండర్లు పిలుస్తామని గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
రూ.105 కోట్ల పనులకు టెండర్ పూర్తి
వరద ముంపు నివారణలో భాగంగా గ్రేటర్ అధికారులు రూ.105 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. రూ.15 కోట్లతో 7 కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. పరిమళ కాలనీ, ప్రెసిడెన్సీ కాలనీ, రాజాజీ కాలనీ, బొక్కల గడ్డ, రంగంపేట, అజర ఆస్పత్రి, కాపువాడ ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. అగడ్త నుంచి వచ్చే వరద నీరు మైసయ్యనగర్ను ముంచెత్తకుండా ఉండేందుకు రూ. 26 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే రూ.45 కోట్లతో శివనగర్‌లో అండర్ గ్రౌండ్ డట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి వరద నీరు అండర్ బ్రిడ్జి మీదుగా 12 మోరీలను కలిపేలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు.దీనికి సంబందించిన టెండర్లు పూర్తియ్యాయి. రూ.54 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులు, రూ.10 కోట్ల సీఎంఏ నిధులతో సమ్మయ్యనగర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు ద్వారా ముచ్చర్ల నాగారం చెరువు వరకు రోడ్డు మధ్య నుంచి అండర్‌గ్రౌండ్ డట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల టెండర్లు అధికారులు పూర్తి చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు తెలపారు.
రూ. 77 కోట్లతో ప్రతిపాదనలు
ముంపు నివారణలో భాగంగా గ్రేటర్ అధికారులు రూ. 77 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. రూ. 45 కోట్లతో ఆర్ఎస్ నగర్ నుంచి 12 మోరీల వరకు అండర్ గ్రౌండ్ డట్ నిర్మాణనికి ప్రతిపాదనలు చేశారు. దీంతో అగడ్త నుంచి వచ్చే వరదను మళ్లించి ఆర్‌ఎస్‌నగర్ మీదుగా 12 మోరీలను కలిపితే శివనగర్, పెరుకవాడ ముంపునకు గురికాకుండా ఉంటుంది. రూ. 30 కోట్ల అంచనాలో కట్టమల్లన్న నుంచి మల్లికుంట, లేబర్‌కాలనీ మీదుగా 100 ఫీట్ల రోడ్డు మీదుగా ఎస్ఆర్ నగర్, గరీబ్‌నగర్ నుంచి చిన్నవడ్డేపల్లి చెరువు వరకు బాక్స్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతో ఎస్ఆర్నగర్, గరీబ్‌నగర్, మధురానగర్, లక్ష్మీగణపతినగర్కు ముంపు తిప్పలు తప్పుతాయని అధికారులు తెలిపారు. రూ.రెండున్నర కోట్లతో సాకరాశికుంట నుంచి కీర్తి బార్ మీదుగా 12 మోరీలకు కలిపేలా డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. దీంతో సాకరాశికుంట, శాంతినగర్‌కు ముంపు బాధ తప్పుతుందని అధికారులు అంటున్నారు.
ప్రతిపాదనలకు త్వరలో ఆమోదం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికారులు పంపించారు. మంత్రి కేటీఆర్‌కు గ్రేటర్ వరంగల్ ముంపుపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఆమోదం వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే కొత్తగా ప్రతిపాదించిన పనులకు టెండర్లు పిలువనున్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన రూ.105 కోట్ల పనులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.