వరంగల్, డిసెంబర్ 30: దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు ఉత్తమ ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి గురువారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌పై దిశానిర్దేశం చేశారు. 2021లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. చిన్నచిన్న మున్సిపాలిటీలు సైతం అవార్డులు సాధించాయన్నారు. అదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో ర్యాంకులు, అవార్డులు సాధించాలని సూచించారు. పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా మార్చుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు దోహదం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో పురపాలక సంఘాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి పేరుతో ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రమని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీలో సిటిజన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి పనులు పూర్తి చేసి స్వచ్ఛత పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్రవిసర్జన నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని, నగరాల్లో ఫ్లెక్సీల ప్రదర్శనను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కమిషనర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, జోనా, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.